🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 22 Jul, 2026 | Page: 1

పేరుకే మహానగరం… చినుకు పడితే చిత్తడి!

17 ఏళ్లుగా సీసీ రోడ్డు లేదు… డ్రైనేజీ వ్యవస్థ లేక నరకయాతన అనుభవిస్తున్న ఇందిరమ్మ కాలనీ వాసులు

హనుమకొండ, జూలై 22 (సుదీక్ష న్యూస్):
స్మార్ట్ సిటీ, మహానగరం అంటూ అభివృద్ధి మాటలు చెబుతున్నా… హనుమకొండ జిల్లా కాజీపేట మండలం 49వ డివిజన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ప్రజల పరిస్థితి మాత్రం ఇప్పటికీ దయనీయంగానే ఉంది. కాలనీ ఏర్పడి 17 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కొద్దిపాటి వర్షం కురిసినా రోడ్లు పూర్తిగా బురదమయంగా మారిపోతున్నాయి. అడుగడుగునా గుంతలు, నీరు నిల్వ ఉండటంతో నడిచి వెళ్లడమే కష్టంగా మారుతోంది. ద్విచక్ర వాహనదారులు తరచూ జారి పడుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, అత్యవసర వైద్య సేవలు కూడా ఈ రహదారుల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కేవలం కాలనీ ప్రజలకే పరిమితం కాకుండా, సమీప గ్రామాల ప్రజలు కూడా పట్టణానికి వెళ్లేందుకు ఈ మార్గాన్నే ఉపయోగిస్తుండటంతో ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఈ ప్రాంత ప్రజల్లో ఆందోళన మొదలవుతోంది.

అనేకసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాలనీ ప్రజల ప్రధాన డిమాండ్లు

* వెంటనే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలి.
* శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
* వర్షపు నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలి.
* గుంతలను పూడ్చి రహదారులను ప్రయాణానికి అనువుగా మార్చాలి.

ప్రత్యేకంగా వరంగల్ మహానగర పాలక సంస్థ మరియు పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)అధికారులు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజల ఇబ్బందులను గుర్తించి తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
🏠 Home