🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 23 Jul, 2026 | Page: 1

హార్ట్ బ‌ర్న్ లేదా యాసిడ్ రిఫ్ల‌క్స్ అంటే ఏమిటి..

మనం ఇష్టమైన ఆహారం తిన్న తర్వాత ఛాతీలో మంట, గొంతు వరకు మంటగా అనిపించడం వంటి సమస్యలను చాలామంది తరచూ ఎదుర్కొంటుంటారు. దీనినే సాధారణంగా హార్ట్‌బర్న్ లేదా యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. రోజువారీ ఆహారపు అలవాట్లే ఈ సమస్యను తగ్గించడంలోనూ, పెంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని ఆహారాలు కడుపులోని ఆమ్ల ప్రభావాన్ని తగ్గించి ఉపశమనం కలిగిస్తే, మరికొన్ని ఆహారాలు లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి. అల్లం టీలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జీర్ణాశయానికి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. ఇది జీర్ణవ్యవస్థలోని వాపుల‌ను తగ్గించి యాసిడ్ రిఫ్లక్స్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. అరటిపండు తక్కువ ఆమ్లత్వం కలిగిన పండు. ఇది అన్నవాహిక లోపలి పొరను రక్షిస్తూ మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులోని పెక్టిన్ అనే పీచు పదార్థం ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
ఓట్ మీల్‌, పుచ్చ‌కాయ‌..
ఓట్‌మీల్ సంపూర్ణ ధాన్యాహారం. ఇది కడుపులోని అదనపు ఆమ్లాన్ని శోషించడంలో సహాయపడి హార్ట్‌బర్న్ లక్షణాలను తగ్గిస్తుంది. సోంపును తక్కువ ఆమ్లత్వం కలిగిన ప‌దార్థంగా పరిగణిస్తారు. ఇది కడుపులోని అధిక ఆమ్ల ప్రభావాన్ని సమతుల్యం చేయడంలో ఉపయోగపడుతుంది. పుచ్చకాయ, త‌ర్బూజా, హనీడ్యూ వంటి మెలన్ పండ్లలో క్షార స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఇవి కడుపులోని పీహెచ్ స్థాయిల‌ని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. వీటిలో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల కడుపు ఆమ్లం పలుచబడుతూ మంట తగ్గే అవకాశం ఉంటుంది. క్యామోమైల్ టీ సహజసిద్ధమైన ప్రశాంతతను కలిగించే లక్షణాలు కలిగి ఉంటుంది. ఒత్తిడి కారణంగా వచ్చే యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను తగ్గించడంలో ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది. చర్మం తొలగించిన తక్కువ కొవ్వు ఉన్న చికెన్ లేదా టర్కీ మాంసం జీర్ణం కావడానికి సులభంగా ఉండి కడుపుపై అదనపు భారం పడకుండా చేస్తుంది.
అలోవెరా జ్యూస్‌..
అలోవెరా జ్యూస్ సహజ శీతలకారిగా పనిచేస్తుంది. ఇది అన్నవాహికలోని వాపు, మంటను తగ్గించడంలో కొంత ఉపశమనం అందిస్తుంది. అలాగే కొన్ని ఆహారాలు హార్ట్‌బర్న్‌ను మరింత పెంచే అవకాశం ఉంటుంది. కాఫీలో ఉండే కెఫిన్ అన్నవాహిక దిగువ భాగంలోని కండరాన్ని సడలించి కడుపులోని ఆమ్లం పైకి రావడానికి కారణమవుతుంది. టమాటాల్లో సహజంగా సిట్రిక్, మాలిక్ ఆమ్లాలు ఎక్కువగా ఉండటం వల్ల కడుపు ఆమ్లత్వాన్ని పెంచి మంటను అధికం చేస్తాయి. చాక్లెట్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీంతో ఆహారం ఎక్కువసేపు కడుపులో ఉండి యాసిడ్ రిఫ్లక్స్ ప్రమాదం పెరుగుతుంది. కారం ఎక్కువగా ఉండే ఆహారాలు కొందరిలో జీర్ణక్రియను మందగించి కడుపులో అసౌకర్యాన్ని, మంటను పెంచుతాయి.
🏠 Home