🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 23 Jul, 2026 | Page: 1

చైనా ఓపెన్‌: ముగిసిన సింధు పోరాటం..

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చైనా ఓపెన్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రీక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ప్రపంచ నాలుగో ర్యాంకర్, ఆతిథ్య చైనా క్రీడాకారిణి చెన్ యుఫెయి చేతిలో 21-16, 20-22, 18-21 తేడాతో ఓటమి పాలైంది. సుమారు గంటన్నర సేపు జరిగిన ఈ పోరు.. టోర్నీలోనే అత్యుత్తమ మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచింది.
హోరాహోరీ పోరు సాగిందిలా..
మొదటి గేమ్‌లో ఆరంభంలో వెనుకబడిన సింధు అద్భుతంగా పుంజుకుంది. విరామ సమయానికి 6-11తో వెనుకబడినా.. వరుసగా 7 పాయింట్లు సాధించి 21-16తో గేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది. రెండో గేమ్‌లోనూ ఆధిపత్యం కొనసాగించిన భారత క్రీడాకారిణి.. 7-3 ఆధిక్యం సాధించి విరామ సమయానికి ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత మరో 4 పాయింట్లు సాధించి 20-16తో విజయానికి చేరువైంది. అయితే.. కీలక సమయంలో తడబడిన సింధు.. అనవసర తప్పిదాలు చేసింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న చెన్.. వరుస పాయింట్లు సాధించి 22-20తో గేమ్‌ను కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ ఇరువురు హోరాహోరీగా తలపడ్డారు. విరామ సమయానికి 11-8తో సింధు ముందంజలో ఉన్నా.. చెన్ క్రమంగా ఒత్తిడి పెంచింది. స్థానిక ప్రేక్షకుల మద్దతుతో మరింత ఆత్మవిశ్వాసంతో చెలరేగిన చైనా స్టార్.. వరుస పాయింట్లు సాధించి 21-18తో గేమ్‌ను గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
🏠 Home