🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 23 Jul, 2026 | Page: 1

విజయ్‌ ‘జననాయగన్‌’గా మెప్పించాడా..?

పురుటి నొప్పులను అనుభవించి, ఒడిదుడుకులను అధిగమించి ఎట్టకేలకు విజయ్‌ ‘జననాయగన్‌’ చిత్రం గురువారం విడుదలైంది. రాజకీయ పార్టీ స్థాపించి, నటుడిగా ఇది తన చివరి సినిమా అని విజయ్‌ ప్రకటించిన నాటినుంచే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. తాను ప్రచారంలో ఉండగానే ఈ సినిమా పూర్తయి, విడుదలకు సిద్ధమైంది. కానీ పలు రాజకీయ కారణాల వల్ల సినిమా విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి.
ఇవిగాక, తమిళనాట ఈ సినిమా పైరసీకి గురవ్వడం, సెన్సార్‌ కష్టాలు.. వీటన్నింటి మధ్య, అసలు ‘జననాయగన్‌’ విడుదల అవుతుందా? అని అంతా భావించిన తరుణంలో తమిళనాడు ఎన్నికల్లో విజయ్‌ ఘన విజయం సాధించి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తెలుగులో బాలకృష్ణ నటించిన ‘భగవంత్‌కేసరి’ రీమేక్‌ అనడంతో తెలుగునాట కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొన్నది. మరి అందరి అంచనాలనూ ‘జననాయగన్‌’ నిజం చేశాడా? లేదా? తెలుసుకోవాలంటే.. అసలు కథలోకి వెళ్లాలి.
కథ…
దుర్మార్గుడైన పొలిటికల్‌ లీడర్‌ రోజా(ప్రకాశ్‌రాజ్‌) చేసే దుర్మార్గాలకు ఎదురు నిలుస్తాడు పోలీస్‌ అధికారి అమ్రేష్‌ పూజారి(బాబీ డియోల్‌). దాంతో అమ్రేష్‌ పూజారిని వేలాదిమంది ముందు తీవ్రంగా అవమానిస్తాడు రోజా. అవమానభారంతో ఆత్మహత్యకు పాల్పడబోయిన అమ్రేష్‌ పూజారిని తన అంతరాత్మే ప్రశ్నిస్తుంది. నీతికీ నిజాయితీకి సమాజంలో విలువ లేదని, అసలుసిసలైన నీచత్వం ప్రజల్లోనే ఉందని, ప్రజాక్షేమం కోసం పాటుపడటం అమాయకత్వమేనని, కుల మత ప్రాంతీయ విబేధాలతో మలినమైనపోయిన ఈ జనం కోసం, డబ్బు, మద్యానికి బానిసలుగా బతుకుతున్న ఈ జనం కోసం నువ్వెందుకు పాటుపడాలని తన అంతరాత్మ ప్రశ్నించడంతో, నీతికీ నిజాయితీకి మారుపేరైన అమ్రేష్‌ పూజారీ నీచుడిగా మారతాడు. జనంపై పగబడతాడు. చెడ్డదారిలో వెళ్లి దేశాన్నే నాశనం చేయాలనుకుంటాడు. ఈ ప్రయత్నంలో తాను అంతర్జాతీయంగా ఎదుగుతాడు. ప్రపంచదేశాలకే ప్రశ్నార్థకంగా మారతాడు. ఇండియాను కూడా నాశనం చేయాలనే అతని ప్రయత్నాన్ని వెట్రీ(విజయ్‌) అడ్డుకుంటాడు. అసలు ఎవరీ వెట్రి? వెట్రికీ, అమ్రేష్‌ పూజారీకీ మధ్య ఉన్న సంబంధం ఏంటి? అమ్రేష్‌పూజారి దుర్మార్గాన్ని వెట్రి ఎలా అడ్డుకున్నాడు? దేశాన్ని ఎలా కాపాడాడు?అనేది మిగతా కథ.
విశ్లేషణ..
ఈ సినిమా స్ట్రెచర్‌ అంతా బాలకృష్ణ ‘భగవంత్‌ కేసరి’ సినిమానే. ఆ కథకు అమ్రేష్‌ పూజారీ అనే అంతర్జాతీయ క్రిమినల్‌ క్యారెక్టర్‌ని యాడ్‌ చేసి దర్శకుడు హెచ్‌.వినోద్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. అమ్రేష్‌ పూజారీ ఎపిసోడ్‌ని మినహాయిస్తే మిగతా కథంతా ‘భగవంత్‌ కేసరి’ సినిమానే. విజయ్‌ రాజకీయ జీవితానికి ఉపయోగపడేలా కొన్ని సీన్స్‌ని ప్రత్యేకంగా రాసుకున్నారు హెచ్‌.వినోద్‌. ‘భగవంత్‌ కేసరి’లో ఉన్న గర్ల్‌ ఎంపవర్‌మెంట్‌ కాన్సెప్ట్‌ని ఇంకాస్త డెవలప్‌ చేసి, కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను మిళితం చేసి ఈ సినిమా చేశారు. బాలకృష్ణ, శ్రీలీల పాత్రల్ని యాజిటీజ్‌గా దించేశారు.
బాలకృష్ణ పోషించిన భగవంత్‌ కేసరి పాత్ర తమిళంలో వెట్రి అయితే.. శ్రీలీల పోషించిన విజ్జి పాప పాత్రను మమితాబైజు పోషించింది. వీరిద్దరికీ సంబంధించి దాదాపుగా ‘భగవంత్‌కేసరి’లో ఉన్న సన్నివేశాలే ఈ సినిమాలోనూ కనిపిస్తాయి. తన మంచి కోసం ఆలోచించిన పోలీస్‌ అధికారి ప్రమాదవశత్తూ చనిపోతూ, తన కూతురుని వెట్రి చేతిలో పెట్టి చనిపోవడం. ఆ పాపను ఆర్మీలో చేర్పించాలనే ఆ తండ్రి జీవితాశయాన్ని నిజం చేసేందుకు వెట్రి అహరహం శ్రమించడం.. ఆ పాపను కంటికి రెప్పలా కాపాడటం.. ఇదంతా ‘భగవంత్‌ కేసరి’ సినిమానే. మరీ కొన్ని సన్నివేశాలనైతే దర్శకుడు హెచ్‌.వినోద్‌ తెలుగు వెర్షన్‌లోంచి ఎత్తి పెట్టాడు. ప్రథమార్ధం అయితే.. ‘భగవంత్‌ కేసరి’ సినిమా చూస్తున్నట్టే ఉంది. ద్వితీయార్ధం కథ కొత్త పుంతలు తొక్కింది. కొత్త సమస్యను చూపించాడు. అద్భుతమైన యాక్షన్‌ సన్నివేశాలను రాసుకున్నాడు. విజయ్‌ కోసం ప్రత్యేకమైన ఎలివేషన్స్‌ని డిజైన్‌ చేశాడు. తమిళనాడుకు ఎమ్జీయార్‌ తర్వాత విజయే అన్నట్టు కొన్ని సన్నివేశాలను ప్రమోట్‌ చేశారు.
ఎవరెవరు ఎలా చేశారు..?
వెట్రిగా విజయ్‌ బాగా చేశాడు. తనదైన ైస్టెల్‌లో ఫ్యాన్స్‌ని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తమిళనాట విజయ్‌ నటనకు విజిల్స్‌ పడటం ఖాయం. తెలుగులో కాజల్‌ చేసిన పాత్రనే పూజా హెగ్డే చేసింది. ఉన్నంతలో బాగా చేసింది. ఇక మమితాబైసు విజ్జిపాపగా ఆకట్టుకుంది. బాబీ డియోల్‌ ఎప్పటిలాగే అద్భుతమైన విలనీ పలికించారు. ఇక ప్రకాశ్‌రాజ్‌ తనదైన శైలి నటనతో మెప్పించారు. మిగతా వారంతా పరిధిమేర రక్తికట్టించారు.
సాంకేతికంగా..
‘భగవంత్‌ కేసరి’కథను ప్రేరణగా తీసుకున్నా.. అందులోని భావోద్వేగాలను ఆ స్థాయిలెఓ ఈసినిమా క్యారీ కాలేదనే చెప్పాలి. కానీ మాస్‌ ప్రేక్షకులకు, ముఖ్యంగా విజయ్‌ అభిమానులకు నచ్చేలా దర్శకుడు హెచ్‌.వినోద్‌ ఈ సినిమాను మలిచాడు. సెకండాఫ్‌ చూపించిన కొత్త కథ ప్రేక్షకులకు నచ్చుతుంది. నేపథ్య సంగీతంతో అనిరుథ్‌ రవిచంద్రన్‌ ఆకట్టుకున్నారు. కెమెరా, ఎడిటింగ్‌ పనితీరు కూడా బావుంది. మొత్తంగా సాంకేతికంగా సినిమా అభినందనీయంగా ఉంది.
🏠 Home