🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 29 Jul, 2026 | Page: 1

440కి 434 మార్కులొస్తే నువ్వేమైనా గొప్పోడివా..

ఇంటర్ ఫస్టియర్‌లో 440కి 434 మార్కులొచ్చాయి.. అయినా సరే మెచ్చుకోవాల్సిన లెక్చరర్.. తనకంటే ఒక మార్కు ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థితో పోలుస్తూ తీవ్రంగా అవమానించింది. అందరిముందు చెంపదెబ్బకొట్టింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన విద్యార్థ మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. గద్వాల జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గద్వాల రూరల్ కొత్తపల్లికి చెందిన నేతిబొట్టు తరుణ్ (17) గద్వాల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బైపీసీ సెకండియర్ చదువుతున్నాడు. ఫస్టియర్ ఫలితాల్లో జిల్లాలోనే రెండో స్థానంలో నిలిచాడు. అయితే శనివారం నాడు తరుణ్‌ను మహిళా లెక్చరర్ తీవ్రంగా అవమానించింది. 435 మార్కులు వచ్చిన మొదటి ర్యాంకర్‌తో పోలుస్తూ తిట్టింది. అలా అవమానపరచడం కరెక్ట్ కాదని లెక్చరర్‌ను తరుణ్ విజ్ఞప్తి చేశాడు. దీనికి లెక్చరర్ మరింత రెచ్చిపోయింది.
నువ్వేమైనా మంత్రి కొడుకువా, అంతకంటే గొప్పోడివా అంటూ తరుణ్ చెంపపై లెక్చరర్ కొట్టింది. అది చూసి క్లాస్‌లోని విద్యార్థులంతా నవ్వారు. దాన్ని అవమానంగా భావించి తరుణ్ తీవ్ర మనస్తాపానికి చెందాడు. ఈ విషయం తెలిసిన ప్రిన్సిపల్ వీరన్న సోమవారం నాడు తరుణ్‌ను బాధపడవద్దని కౌన్సెలింగ్ ఇచ్చి పంపించాడు. ఇక మంగళవారం నాడు తరుణ్ కాలేజీకి రాలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటిపైకప్పునకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు జరిగిన అవమానంపై తరుణ్ సూసైడ్ నోట్ రాశాడు.
🏠 Home