🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 29 Jul, 2026 | Page: 1

మళ్లీ ఒకేసారి.. వచ్చేనెల రేషన్‌ దుకాణాల్లో మూడు నెలల బియ్యం పంపిణీ

రేషన్‌ లబ్ధిదారులకు మళ్లీ మూడు నెలలకు సంబంధించిన బియ్యం కోటా అందనుంది. ఎల్‌నినో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలకు కలిపి ఒకేసారి బియ్యం పంపిణీ చేయనున్నాయి. డీలర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తూ.. కార్డుదారుల సంఖ్యను తెలియజేస్తే నెలాఖరులోగా బియ్యం మొత్తాన్ని సరఫరా చేస్తామని తెలిపాయి.గ్రేటర్‌లోని హైదరాబాద్‌ జిల్లాలో 8,42,348, రంగారెడ్డిలో 6,72,909, మేడ్చల్‌లో 6,53,801 కార్డులున్నాయి. ఇందులో భాగంగా మూడు జిల్లాల్లో నెలకు సుమారు 39,75,0277 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. అలాగే చక్కెర, గోధుమలను కూడా అందజేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే ఒకసారి మూడు (ఏప్రిల్‌, మే, జూన్‌) నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకే విడతలో సరఫరా చేశారు. అయితే, ఈ-పాస్‌ యంత్రం మొరాయించడంతో కొందరు రోజుల తరబడి తిరిగారు. ఈ తరుణంలో క్షేత్రస్థాయిలో ఏర్పడిన ఈ సమస్యలన్నింటినీ తెలుసుకున్న అధికారులు.. లబ్ధిదారుల వేలిముద్రలు, ఐరిస్ నమోదులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేస్తున్నారు.. ఒక్కో కార్డుదారుడికి 5 నిమిషాల్లోపే ప్రక్రియను పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు.మూడు నెలల కోటాకు సంబంధించిన బియ్యం ఒకేసారి పంపిణీతో అందుకు తగ్గట్టుగా నిల్వలు చేసేందుకు సరిపడా గదులు లేవని కొంతమంది డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల్లో పలు రేషన్‌ దుకాణాలు చిన్నపాటి గదుల్లో నిర్వహిస్తుండడమే కారణంగా నిలుస్తోంది. గత వేసవిలో మూడు నెలల బియ్యం ఒకేసారి సరఫరా చేయడంతో వాటిని భద్రపరిచి లబ్ధిదారులకు ఇచ్చేందుకు డీలర్లు ఇబ్బందులు పడ్డారు. తాజాగా మళ్లీ మూడునెలల సరుకు ఒకేసారి వస్తుండడంతో కార్డుల సంఖ్య ఎక్కువ ఉన్న డీలర్లు ఆందోళన చెందుతున్నారు. వచ్చిన నిల్వలను ఎక్కడ భద్రపరచాలని సతమతమవుతున్నారు. ఈ క్రమంలో కొందరు తమ ఇళ్లలోనే నిల్వలను ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు పదిరోజుల్లో విడతల వారీగా బియ్యం సరఫరా చేస్తే బాగుంటుందని వారు కోరుతున్నారు.
🏠 Home