భారత్‌కు జిన్‌పింగ్ రాక?..
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్‌ను సందర్శించే అవకాశమున్నట్లు దౌత్య వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్(BRICS) శిఖరాగ్ర సదస్సుకు ఆయన హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటన ఖరారైతే.. 2020లో గల్వాన్ లోయలో భారత్-చైనా సైన్యాల మధ్య జరిగిన ఘర్షణ అనంతరం జిన్‌పింగ్ భారత్‌కు రావడమిదే తొలిసారి కానుంది.జిన్‌పింగ్ చివరిసారిగా 2019 అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించారు. ఆ తర్వాత తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలు, గల్వాన్ ఘర్షణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం సైనిక, దౌత్య స్థాయిలో పలు దఫాలుగా చర్చలు కొనసాగుతున్నాయి. చైనా అధ్యక్షుడి పర్యటనకు ముందు ఇరు దేశాల మధ్య దౌత్య చర్చలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ త్వరలో చైనాలో పర్యటించే అవకాశాలూ కనిపిస్తున్నాయి. అలాగే భారత్-చైనా సరిహద్దు వ్యవహారాలపై వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్(WMCC) సమావేశం కూడా జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.