🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 14 Jun, 2026 | Page: 1

రేపటి నుంచే విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ - సోమవారం నుంచి శనివారం వరకు ఇదే మెనూ

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో బ్రేక్‌ఫాస్ట్‌ పథకానికి ఈ నెల 15న (రేపు) రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలి విడత మొత్తం 1,302 విద్యా సంస్థల్లో ప్రారంభించనున్నారు. అందులో 1,269 స్కూల్స్, 33 కాలేజీలు ఉన్నాయి. వాటిల్లోని మొత్తం 1,44,610 మంది స్టూడెంట్స్​కు వారంలో ఆదివారం మినహా మిగిలిన 6 రోజులు ఉదయం పూట అల్పాహారం అందిస్తారు.

రాష్ట్ర ప్రభుత్వం వాటా 70 శాతం : బ్రేక్‌ఫాస్ట్‌ పథకాన్ని సెంట్రలైజ్డ్‌ కిచెన్ల ద్వారా విడతల వారీగా నూతన విద్యా సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో అమలు చేస్తారు. మొత్తం 33 జిల్లాల్లో 39 చోట్ల కేంద్రీకృత కిచెన్ల నిర్మాణానికి రూ.299.90 కోట్లు ఖర్చు అవుతుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. అందులో ఇప్పటికే ఉన్న ఏడు కిచెన్లను ఉన్నతీకరిస్తారు. మిగిలినవి నూతనంగా నిర్మాణం చేపట్టనున్నారు. ఒక్కో కిచెన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 70 శాతం భరిస్తుంది. మిగిలిన 30 శాతం మొత్తాన్ని ఆయా స్వచ్ఛంద సంస్థలు ఖర్చు భరించనున్నాయి. కిచెన్ల నిర్మాణ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ, మౌలిక అభివృద్ధి సంస్థ పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే టెండర్లు కూడా ఖరారయ్యాయి.
🏠 Home