అర్ధాంతరంగా ప్రైవేటు స్కూళ్ల మూసివేత..
రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లు అర్ధాంతంగా మూతబడుతున్నాయి. తగిన నోటీసు ఇవ్వకుండా ఉన్న పళంగా తాళాలేసేస్తున్నాయి. ఈ స్కూళ్లలోని విద్యార్థుల వెతలు అన్నీ ఇన్నీ కావు. నాలుగైదేండ్ల క్రితం మూత బడ్డ బడుల్లోని విద్యార్థులు స్టడీ సర్టిఫికెట్లు అందక, టీసీలు చేతికి రాక అవస్థలు పడుతున్నారు. కరోనా అనంతర కాలంలో రాష్ట్రంలో రెండు వేల స్కూళ్లు మూతబడ్డాయి. మూతబడ్డ బడుల వ్యవహారంలో పాఠశాల విద్యాశాఖ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.ఏదైనా ప్రైవేట్ స్కూల్ మూతబడితే సంబంధిత స్కూల్ రికార్డులను విద్యాశాఖ స్వాధీనం చేసుకోవాలి. సమీపంలోని సర్కార్ బడులకు అందజేయాలి. విద్యార్థులకు టీసీలు, ఇతర సర్టిఫికెట్లు ఇచ్చి, వారిని సమీపంలోని ప్రభు త్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో చేర్పించాలి. కానీ, అనేక మూతబడ్డ బడుల విషయంలో ఇది అమలుకావడం లేదు. దీంతో ఆయా స్కూళ్లలోని విద్యార్థులు ఇక్కట్లకు గురవుతున్నారు. రికార్డులు ఇంకా ప్రైవేట్ బడుల చేతిలోనే ఉంటున్నాయి. కొన్ని యాజమాన్యాలైతే విద్యార్థులను ముప్పుతిప్పులు పెడుతున్నాయి. కొన్ని బడులైతే బోగస్ సర్టిఫికెట్లు జారీచేస్తున్నాయి.విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకొని, స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మూతబడ్డ బడుల్లోని రికార్డులు స్వాధీనం చేసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.కొన్ని ఉదంతాలు..కరోనా కాలంలో ఓ కార్పొరేట్ స్కూల్ బ్రాంచిని మూసివేశారు. ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ఐదేండ్లుగా స్టడీ సర్టిఫికెట్ల కోసం ఆపసోపాలు పడుతున్నారు.ఓ ప్రముఖ విద్యాసంస్థ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తమ స్కూల్‌ను మూసివేసింది. టీసీలు, స్టడీ సర్టిఫికెట్ల కోసం వి ద్యార్థులను అమీర్‌పేటకు పిలిపించుకొని వారి నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు చెప్తున్నారు.ఓ విద్యార్థిని 4,5,6 తరగతులు ఒక ప్రైవేట్ స్కూళ్లో చదివింది. ఆ స్కూల్ మూతబడటంతో సమీపంలోని సర్కార్ బడిలో చేరింది. 8వ తరగతి వరకు టీసీ అవసరం లేకపోవడంతో సర్కార్ బడిలో అడ్మిషన్ ఇచ్చారు. కానీ, ఇప్పుడు లోకల్ కోటాలో సీట్లు, ఉద్యోగాల కోసం స్టడీ సర్టిఫికెట్లు లేకపోవడంతో సదరు విద్యార్థి ఇబ్బందులు పడుతున్నది.