🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 18 Jun, 2026 | Page: 1

18 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించడం గొప్ప సేవ : సీపీ సంప్రీత్ సింగ్


వరంగల్, జూన్ 18 (సుదీక్ష న్యూస్):
కోయ, బలిజ, గిరిజన, ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన 18 జంటలకు ఉచితంగా సామూహిక వివాహాలు నిర్వహించడం గొప్ప సామాజిక సేవ అని వరంగల్ పోలీస్ కమిషనర్ సంప్రీత్ సింగ్ అన్నారు.
బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో సామూహిక వివాహాల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన జంటలకు బంగారు పుస్తెలు, మట్టెలు తదితర వివాహ సామగ్రిని అందించి వివాహాలు జరిపించడం అభినందనీయమని పేర్కొన్నారు. శివానందగురు కల్చరల్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.ఈ సందర్భంగా శివానందగురు కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ త్రిపురనేని గోపీచంద్ మాట్లాడుతూ, ఈ నెల 24వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ములుగు రోడ్డులోని సప్తధామ్లో సామూహిక వివాహాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శివానందమూర్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో 18 జంటలకు పూర్తిగా ఉచితంగా వివాహాలు జరిపించనున్నామని చెప్పారు.
వివాహం చేసుకోవాలనుకునే అర్హత కలిగిన జంటలు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, ఆసక్తి గల వారు 98484 23133 నంబర్‌ను సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని సూచించారు.
వివాహ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ట్రస్ట్ పర్యవేక్షణలో చేపడుతున్నామని, వధూవరులు మరియు వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏసీపీ అంత్తయ్య, ట్రస్టీలు బండారు సాయినారాయణ, సదాశివుడు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలు సహకరించాలని నిర్వాహకులు కోరారు.
🏠 Home