🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 18 Jun, 2026 | Page: 1

మత్తు పదార్థాల నియంత్రణలో డ్రగ్స్ కంట్రోల్ టీం పనితీరు అభినందనీయం : సీపీ సన్‌ప్రీత్ సింగ్

వరంగల్, జూన్ 18 (సుదీక్ష న్యూస్):
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ఏర్పాటు చేసిన డ్రగ్స్ కంట్రోల్ టీం పనితీరు ప్రశంసనీయమని పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. 2024 జూలై 15 నుంచి 2026 జూన్ 16 వరకు ప్రత్యేక బృందం చేపట్టిన చర్యల ద్వారా 192 కేసులు నమోదు చేసి, 403 మందిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ కాలంలో 1,241 కిలోలకుపైగా గంజాయి, 1.53 కిలోల ఓపియం, 22.4 లీటర్ల హషీష్ ఆయిల్‌తో పాటు మొత్తం రూ.8.57 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే 601 మొబైల్ ఫోన్లు, 63 ద్విచక్ర వాహనాలు, 8 కార్లు, 6 ఆటోలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన 435 మందికి కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, విద్యాసంస్థల పరిసరాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి గంజాయి, పొగాకు ఉత్పత్తుల అక్రమ విక్రయాలపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

గంజాయి సాగు, రవాణా, నిల్వ లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం ఉంటే 8712685299, 8712584473 నంబర్లకు తెలియజేయాలని, సమాచారదాతల వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.

మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని సీపీ సన్‌ప్రీత్ సింగ్ విజ్ఞప్తి చేశారు.
🏠 Home