🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 19 Jun, 2026 | Page: 1

మా ఇంటి బంగారం’

మూడేళ్ల విరామం తర్వాత సమంత చేసిన సినిమా ‘మా ఇంటి బంగారం’. దాంతో ఈ సినిమాపై అంచనాలు మొదట్నుంచీ భారీగానే ఉన్నాయి. పైగా ‘ఓ బేబీ’ తర్వాత నందినీరెడ్డి, సమంత కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై ఆసక్తి జనాల్లో మెండుగానే ఉన్నది. ఈ సినిమాలో సమంత తొలిసారి యాక్షన్‌ రోల్‌ పోషించారు. ప్రచార చిత్రాలకూ, పాటలకు కూడా మంచి స్పందన రావడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియన్స్‌ ఆతృతగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ శుక్రవారం ‘మా ఇంటి బంగారం’ థియేటర్లలోకి వచ్చింది. మరి అందరి అంచనాలనూ ఈ బంగారం నిజం చేసిందా? లేదా? తెలుసుకునేముందు కథేంటో చూద్దాం..

కథ
ప్రేమ వివాహం చేసుకొని, ఓ సంప్రదాయ కుటుంబంలోకి పెద్ద కోడలుగా ఎంట్రీ ఇస్తుంది స్వర్ణ(సమంత). ఇంట్లోకి వచ్చిన నాటి నుంచి అప్పటికే ఇంట్లో ఉన్న చిన్నకోడలు అనసూయ(శ్రీముఖి)తో పోలుస్తూ అంతా ఆమెను చూస్తుంటారు. అనసూయ ఇంటిని చక్కదిద్దటంలో దిట్ట. కానీ స్వర్ణకు మాత్రం ఆ ఇంటి విషయాలు ఏమీ తెలియవు. కానీ ఎలాగైనా పెద్ద కోడలుగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతుంది. దీనికి తన చిన్ననాటి స్నేహితురాలు ఆమెకు సహాయం చేస్తుంటుంది. ఈ విధంగా సరదాగా కథ సాగుతూవుంటుంది. మరోవైపు నక్సలైట్‌ ముసుగులో దుర్మార్గాలకు తెగబడే నీచుడైన గుల్షన్‌ దేవయ్య జైల్లో శిక్ష అనుభవిస్తుంటాడు. తనకు అనుచరుడి ద్వారా తన సహ నక్సలైట్‌ అయిన ఝాన్సీ ఆచూకీ తెలుస్తుంది. ఆ ఝాన్సీనే స్వర్ణగా పేరు మార్చుకొని బతుకుతున్నదని తెలుసుకున్న గుల్షన్‌ దేవయ్య, ఎలాగైనా ఝాన్సీని దక్కించుకునేందుకు జైలు నుంచి పారిపోయి వస్తాడు. ఝాన్సీ వేరే వ్యక్తిని పెళ్లాడిందని తెలుసుకొని రగిలిపోతాడు. ఎలాగైనా ఝాన్సీని, ఆమె కుటుంబాన్నీ నాశనం చేయాలనుకుంటాడు. మరి స్వర్ణ రూపంలో ఉన్న ఝాన్సీ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నది? అసలు స్వర్ణలా ఝాన్సీ ఎందుకు మారింది? ఈ స్వర్ణ ఎవరు? ఆమె కథేంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

విశ్లేషణ

హీరో తన అసలు రూపాన్ని దాచి, అజ్ఞాతంలో బతకడం.. సరదాగా సాగిపోతున్న కథలోకి హీరో పాత జీవితం వెంటాడటం.. కొన్ని బలీయమైన పరిస్థితులు కారణంగా అతనెవరో రివీలవ్వడం.. చివరకు హీరో దుర్మార్గుల్ని తుదముట్టించడం.. కథ సుఖాంతం కావడం.. ఈ తరహా కథలు ఇప్పటివరకూ లెక్కలేన్నన్ని వచ్చాయి. ‘మా ఇంటి బంగారం’ విషయంలో కొత్తగా కనిపించిన విషయం ఏంటంటే.. ఇది లేడీ ఓరియెంటెడ్‌ సబ్జెక్ట్‌ కావడమే. ఈ తరహా కథ ఓ హీరోయిన్‌ చేయడం మాత్రం కొత్తగా ఉన్నది. ఫస్టాఫ్‌ సినిమా చూస్తున్నంతసేపూ మహేశ్‌బాబు ‘అతడు’ సినిమా గుర్తొస్తుంది. అందులో మహేశ్‌ కిరాయి హంతకుడు. ఇందులో సమంత నక్సలైట్‌. అంతే తేడా. కథ పాతదైనా దాన్ని కొత్తగా చెబితే సినిమా హిట్టే. ఈ విషయంలో దర్శకురాలు నందినిరెడ్డి సక్సెస్‌ అయ్యిందనే చెప్పాలి. ప్రథమార్థంతో సమంతను కుటుంబ స్త్రీగా చూపించిన తీరు, అక్కడ్నుంచీ నిదానంగా ఆమె ట్రాన్స్‌ఫర్మేషన్‌.. సమంతతో చేయించిన పోరాటాలు, ఈ నేపథ్యంలో వచ్చే ఉత్కంఠభరితమైన సన్నివేశాలు మాస్‌ ఆడియన్స్‌కి బాగా పట్టేస్తాయి. ఫస్ట్‌హాఫ్‌లో ఇంట్లో జరిగే కామెడీ సన్నివేశాలు, కారు ఛేజింగ్‌ సీక్వెన్స్‌ చాలా బావున్నాయి. పెద్ద కోడలిగా ఆ ఇంట్లో స్థానం కోసం సమంత పాత్ర చేసే ప్రయత్నాలు, తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు సమంత చేసే సాహసాలు ఆడియన్స్‌కి నచ్చేస్తాయి. ఇక సెకండాఫ్‌లో కథ కాస్త స్లో అయినట్టు అనిపిస్తుంది. తనెవరో తన ఇంట్లో అందరికీ రివీల్‌ చేసే క్రమంలో కాస్త కథ నిదానించిన ఫీలింగ్‌ కలుగుతుంది. అయినా సెకండాఫ్‌లో బస్‌ ఎపిసోడ్‌ కానీ, ైక్లెమాక్స్‌ ఫైట్‌ కానీ మాస్‌ ఆడియన్స్‌కి నచ్చేస్తాయి. ఈ సినిమాలో సమంత చేసిన ఫైట్స్‌ హైలైట్‌గా చెప్పుకోవాలి. హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా అద్భుతమైన పోరాటలు చేసి శభాష్‌ అనిపించుకున్నది సమంత.
🏠 Home