🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 19 Jun, 2026 | Page: 1

క్షుద్రపూజల అనుమానం..

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. క్షుద్ర పూజలు చేస్తోందన్న అనుమానంతో ఓ డాక్టర్ తన ఇంటి పని మనిషిని చంపేశాడు. క్రికెట్ బ్యాట్‌తో కొట్టి.. కత్తితో పొడిచి ప్రాణాలు తీసేశాడు. గురువారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మౌంట్ కైలాశ్ ఏరియాకు చెందిన మనీశ్ గుప్తా డెర్మటాలజిస్టుగా సేవలందిస్తున్నాడు. మనీశ్ ఇంట్లో గత 15 ఏళ్ల నుంచి మీనా అనే మహిళ పని చేస్తోంది. మీనా క్షుద్ర పూజలు చేస్తోందని మనీశ్‌కు అనుమానం కలిగింది.
ఆమె కారణంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తోందని భావించాడు. ఆయుర్వేదిక్ ప్రాక్టిషనర్ అయిన తన భార్యతో.. మీనాను ఉద్యోగం నుంచి తీసేయమని చెప్పాడు. ఇందుకు ఆమె ఒప్పుకోలేదు. ‘మీ అమ్మ క్యాన్సర్‌తో బాధపడుతున్న సమయంలో మీనా ఎంతో సేవ చేసింది’ అని భర్తతో చెప్పింది. దీంతో మనీశ్ మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో పని మనిషికి ఉన్న విలువ కూడా తనకు లేదని అనుకున్నాడు. ఇదే విషయం అతడిలోని రాక్షసుడిని బయటకు తీసింది. భార్య డ్యూటీకి వెళ్లిన తర్వాత మనీశ్ పని మనిషితో గొడవ పెట్టుకున్నాడు. గొడవ చిలికిచిలికి గాలి వానలా మారింది. ఈ నేపథ్యంలోనే మనీశ్ బ్యాట్‌తో మీనాపై దాడి చేశాడు. అనంతరం కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపేశాడు. ఉదయం 11 గంటల ప్రాంతంలో పోలీసులకు మీనా మర్డర్ సమాచారం అందింది. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మీనా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మనీశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మనీశ్ చేసిన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల నుంచి కేసును దర్యాప్తు చేస్తున్నారు.
🏠 Home