🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 22 Jun, 2026 | Page: 1

అది ఫేక్ వీడియో- నీట్ రీ ఎగ్జామ్‌ను విజయవంతంగా నిర్వహించాం : పేపర్ లీక్ ఆరోపణలపై NTA క్లారిటీ

దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన నీట్ యూజీ రీ-టెస్ట్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందని సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వీడియో నకిలీదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తెలిపింది. నీట్ యూజీ పరీక్షను కట్టుదిట్టమైన భద్రత, నిఘా మధ్య విజయవంతంగా నిర్వహించామని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, ఈ వీడియో ఫేక్‌ అని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. నీట్ యూజీ పేపర్ లీక్ ఆరోపణలు నిరాధారమైనవని, అసత్యమైనవని ప్రభుత్వ అధికారిక నిజ నిర్ధరణ విభాగమైన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పష్టం చేసింది.

వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం : ఎన్‌టీఏ
నీట్ యూజీ- 2026 రీ ఎగ్జామ్​కు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఒక కల్పిత వీడియో తమ దృష్టికి వచ్చిందని ఎన్‌టీఏ ప్రకటించింది. ఆ వీడియో నకిలీదని, అందులోని వాదనలు అవాస్తవమని స్పష్టం చేసింది. విద్యార్థులను తప్పుదోవ పట్టించడానికి, వారిలో ఆందోళన కలిగించడానికి ఇటువంటి తప్పుడు సమాచారాన్ని సృష్టించడం, ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేయడాన్ని తీవ్రమైన నేరంగా అభివర్ణించింది. ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కో-ఆర్డినేషన్‌ సెంట ర్‌(ఐ4సీ), చట్ట అమలు సంస్థల సహకారంతో ఈ కంటెంట్‌ను సృష్టించిన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. పరీక్షకు సంబంధించిన సమాచారం కోసం ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్, ధ్రువీకరించిన సోషల్ మీడియా ఖాతాలను అనుసరించాలని సూచించింది. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని మరింతగా ప్రచారం చేయవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలకు విజ్ఞప్తి చేసింది. 20 లక్షలకు పైగా నీట్ అభ్యర్థులు ప్రశాంతమైన, నిష్పక్షపాతమైన ప్రక్రియకు అర్హులని పునరుద్ఘాటించింది.
🏠 Home