🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 22 Jun, 2026 | Page: 1

'షీర్​వాల్​' పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం - రెండో విడతలో పూరిళ్లకే అధిక ప్రాధాన్యం

ప్రతి మధ్యతరగతి, పేద కుటుంబాలకు సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్​ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా వారంతా పక్కా ఇళ్లు నిర్మించుకునేందుకు సహాయపడుతోంది. దీంట్లో భాగంగానే మొదట విడత ఇళ్ల మంజూరు చేశారు. దానికి అనుగుణంగా విడతల వారిగా నిధులను కేటాయిస్తున్నారు. ప్రస్తుతం రెండో విడత ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం సిద్ధమైతుంది. దీంట్లో ప్రధానంగా గుడిసెలలో నివసించేవారినే లక్ష్యంగా తీసుకోనుంది. అలాగే వీరికి 'షీర్​వాల్'​ టెక్నాలజీ పద్ధతిలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టేందుకు ఏర్పాటు చేస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా 24వేల పూరిళ్లు : ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. ఆ క్రమంలో పూరిళ్లలో నివసిస్తున్న వారిని గుర్తించారు. అప్పుడు ప్రాథమికంగా రాష్ట్ర వ్యాప్తంగా 24 వేల మంది పూరీ గుడిసెల్లో నివసిస్తున్నట్లు తేలింది. దీంతో రెండో విడతలో గుడిసెల్లో నివసించే వారికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే షీర్‌వాల్‌ టెక్నాలజీ పద్ధతిలో ఇంటి నిర్మాణం చేపట్టే విధంగా హౌసింగ్‌ కార్పొరేషన్‌ ప్రణాళికలు రూపొందిస్తోంది.

నిర్మాణ వ్యయానికి చెక్! : ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పేరిట ప్రభుత్వం నాలుగు విడతలుగా రూ. 5 లక్షలను విడుదల చేస్తోంది. అయితే ప్రస్తుతం ఇటుక, సిమెంట్​, ఐరన్​, ఇసుక వంటి ముడి వస్తువులకు భారీగా ధరలు పెరిగిపోయాయి. దీనివల్ల ప్రభుత్వం అందించే సహాయంతో పాటు వారికి ఇంకా అదనంగా ఖర్చు అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పూరిళ్లలో నివసించే వారు ముందుగా డబ్బులు పెట్టి నిర్మించుకోలేరు. అందుకే ప్రభుత్వం షీర్‌వాల్‌ పద్ధతిలో ఇంటిని నిర్మించి ఇస్తామని అంటుంది.

నమూనా ఇల్లు నిర్మాణం : ఈ షీర్​వాల్​ టెక్నాలజీని ఉపయోగించి ఓ స్టార్టప్‌ కంపెనీ పోయిన సంవత్సరం సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 400 చదరపు అడుగుల్లో నమూనా ఇంటిని చేపట్టింది. ఇది విజయవంతంగా పూర్తి అయ్యింది. ఇటీవల కుమురం భీం జిల్లా కెరమెరి మండలం కొఠారి పంచాయతీ పరిధిలోని కొత్తగూడలో షీర్​వాల్​ పద్ధతిలోనే ఇళ్లను నిర్మించారు. పూర్తి చేసిన ఇళ్లను లబ్ధిదారులకు అందించారు.

15 రోజుల్లోనే పూర్తి : 22.3 అడుగుల పొడవు, 18 అడుగుల వెడల్పుతో మొత్తం 400 అడుగులతో స్లాబ్​ వచ్చే విధంగా సంగారెడ్డి జిల్లా జిన్నారంలో ఓ నమూనా ఇల్లు నిర్మాణం చేపట్టారు. దానికి 8ఎంఎం, 10ఎంఎం స్టీల్, రెడీమిక్స్‌డ్‌ సెల్ఫ్‌ కాంపాక్టింగ్‌ కాంక్రీట్, అల్యూమినియం ప్యానెల్‌ వినియోగించారు. ఈ పద్ధతిలో ఇల్లు నిర్మాణం కోసం మొత్తం 15 రోజుల సమయం పడుతుంది. మొదట ఐదు రోజులు పునాది వేస్తారు. ఆ తర్వాత ఆరు రోజుల పాటు శ్లాబ్​ నిర్మాణం ఉంటుంది. మిగిలిన నాలుగు రోజుల్లో ప్లాస్టరింగ్​ వంటి పనులను పూర్తి చేస్తారు. అయితే ఇదంతా కేవలం రూ. లక్షల్లోనే ఖర్చు అవుతుంది.
🏠 Home