ఏఐఎఫ్‌డీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ
సుదీక్ష న్యూస్, కాట్రపల్లి:
అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (AIFDS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున స్వగ్రామమైన కాట్రపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో గురువారం 150 నోట్‌బుక్స్, 20 పెన్నులను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గడ్డం నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత ప్రీ-ప్రైమరీ విద్యను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. కొద్ది పాఠశాలలకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈ సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, నాన్-టీచింగ్ సిబ్బంది, డీఈఓ, ఎంఈఓ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏఐఎఫ్‌డీఎస్ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తోందని తెలిపారు.
అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు గ్రామస్తులంతా ఐక్యంగా కృషి చేసి తమ పాఠశాలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరభద్రయ్య, గడ్డం బాలకృష్ణ, గోవర్ధన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.