🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 02 Jul, 2026 | Page: 1

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా..?

ఇరాన్-అమెరికా యుద్ధం ముగియడం, పశ్చిమాసియాలో శాంతి నెలకొనడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయేమోనని వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర పెట్రోలియం, చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశం లేదన్నారు. అయితే, కొన్ని వారాలపాటు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు స్థిరంగా, తక్కువగా ఉంటే అప్పుడు ప్రభుత్వం ధరల్ని తగ్గిస్తుందని చెప్పారు.

ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటినుంచి జూన్ 30 వరకు చమురు కంపెనీలు రూ.74,781 నష్టపోయాయన్నారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ అమ్మకాల ద్వారా ఈ మేరకు కంపెనీలు నష్టపోయాయన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ కంపెనీలు ఇంకా నష్టాల్లోనే నడుస్తున్నాయన్నారు. కారణం చమురు కంపెనీలు ఇంకా గతంలో కొనుగోలు చేసిన క్రూడాయిల్‌నే ప్రాసెస్ చేస్తున్నాయన్నారు. కంపెనీలు దాదాపు రెండు నెలల ముందు చమురును కొంటాయని, ప్రస్తుతం శుద్ధి చేస్తున్న చమురును రెండు నెలల క్రితం ఎక్కువ ధరకు కొనుగోలు చేశాయని పూరి తెలిపారు. అందువల్లే ఇప్పుడు ధరలు తగ్గే అవకాశం లేదన్నారు. అయితే, ఈ అంశంపై బుధవారం సమీక్ష జరిపినట్లు తెలిపారు.
🏠 Home