🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 07 Jul, 2026 | Page: 1

ప్రిజ‌ర్వేటివ్స్ ఉన్న ఆహారాల‌ను అధికంగా తీసుకుంటే గుండె జ‌బ్బుల ముప్పు..

గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా కొనసాగుతున్నాయి. ఆహారపు అలవాట్లు గుండె ఆరోగ్యంపై కీలక ప్రభావం చూపుతాయని ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో ప్రాసెస్డ్ ఆహారాల్లో ఉపయోగించే కొన్ని సాధారణ ప్రిజర్వేటివ్‌లు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచే అవకాశముందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫ్రాన్స్‌కు చెందిన న్యూట్రినెట్-సాంటే (NutriNet-Santé) పరిశోధనలో లక్ష మందికిపైగా వ్య‌క్తుల‌ను పరిశీలించారు. ఈ ఏడాది మే 20న ప్రచురితమైన ఈ అధ్యయనంలో కొన్ని ఆహార ప్రిజర్వేటివ్‌లకు ఎక్కువగా గురైన వారిలో గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.
ఏయే ప్రిజ‌ర్వేటివ్‌ల‌ను గుర్తించారు..
పరిశోధకులు గుండె ఆరోగ్యానికి సంబంధం ఉన్న 8 సాధారణ ప్రిజర్వేటివ్‌లను గుర్తించారు. అవి పొటాషియం సోర్బేట్ (E202), పొటాషియం మెటాబైసల్ఫైట్ (E224), సోడియం నైట్రైట్ (E250), ఆస్కార్బిక్ యాసిడ్ (E300), సోడియం ఆస్కార్బేట్ (E301), సోడియం ఎరిథార్బేట్ (E316), సిట్రిక్ యాసిడ్ (E330), రోజ్‌మేరీ ఎక్స్‌ట్రాక్ట్స్ (E392). ఈ ప్రిజర్వేటివ్‌లకు అత్యధికంగా గురైన వ్యక్తుల్లో రక్తపోటు వచ్చే ప్రమాదం 29 శాతం ఎక్కువగా ఉండగా, గుండెపోటు, స్ట్రోక్, యాంజైనా వంటి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం 16 శాతం అధికంగా ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. ప్రిజర్వేటివ్‌లను ఆహార పదార్థాల నిల్వకాలాన్ని పెంచేందుకు, వాటి నాణ్యతను కాపాడేందుకు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్యాకెట్ స్నాక్స్, ప్రాసెస్డ్ మాంసాహార ఉత్పత్తులు, బేకరీ పదార్థాలు, సాస్‌లు, రెడీ-టు-ఈట్ ఆహారాలు, పానీయాలు వంటి అనేక పారిశ్రామికంగా తయారైన ఆహారాల్లో ఇవి సాధారణంగా ఉంటాయి.
🏠 Home