Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

టమోటా కిలో రూ.10లోపే..

Author Neti Sudiksha | 28 Jul 2026, 12:47 PM | ANDHRA PRADESH
టమోటా కిలో రూ.10లోపే..

టమోటా రైతులకు ఈసారి ఆదిలోనే హంసపాదు అన్న పరిస్థితి ఎదురవుతోంది. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట చేతికొచ్చిన సమయంలో ధరల పతనం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సీజన్‌ ప్రారంభంలోనే పరిస్థితులు తలకిందులు కావడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలోకి పడిపోయారు. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చేలా కనిపించలేదని కన్నీరుపెడుతున్నారు. కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోతోందని వాపోతున్నారు. చేసేదిలేక పంటను తోటలోనే వదిలేయడం, లేదంటే రోడ్లపక్క పారబోసే దృశ్యాలు నిత్యం కనిపిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో కొన్నేళ్లుగా టమోటా సాగు బాగా పెరిగింది. సాధారణంగా సీజన్‌ ప్రారంభంలో ధరలు ఆశాజనకంగా ఉంటాయి. దీంతో రైతులు ముందస్తుగా పంట సాగు చేస్తున్నారు. మే, జూన్‌లో ఎండలతో ప్రతికూల పరిస్థితులు ఉన్నా మొక్కలు నాటి సంరక్షించుకుంటున్నారు. దీని వల్ల సీజన్‌ ప్రారంభంలోనే పంట మార్కెట్‌కు తరలిస్తే మంచి గిట్టుబాటు ఉంటుందని రైతులు భావిస్తున్నారు. కానీ ఈసారి పరిస్థితి తల్లకిందులయింది. దిగుబడి బాగా ఉన్నా.. ధరల పతనంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కంబదూరు, కుందుర్పి, శెట్టూరు, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం మండలాల్లో ఎక్కువగా సాగు చేశారు.
గత ఏడాది సీజన్‌ ప్రారంభంలో కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో కిలో గరిష్ట ధరలు రూ.30 నుంచి రూ.40 మధ్య పలికాయి. 15 కిలో బాక్సుకు రూ.450 నుంచి రూ.600 వరకు లభించింది. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు ఈసారి ముందస్తుగానే పంట సాగు చేశారు. ప్రస్తుతం ఆశించిన స్థాయిలో ధరలు లేకపోవడంతో రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. ప్రస్తుతం కిలో గరిష్ట ధర రూ.10 నుంచి రూ.12మధ్య ఊగిసలాడుతోంది.
ధరలు పతనానికి ఎగుమతులు మందగించడమే ప్రధాన కారణమని వ్యాపార వర్గాలు అంటున్నా యి. ఉమ్మడి జిల్లాలో సుమారు 23వేల హెక్టార్లలో టమోటా సాగులో ఉన్నట్లు సంబంధిత అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 20శాతం కోత ద శలో ఉందంటున్నారు. పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో కాయలు మార్కెట్‌ పెద్ద ఎత్తు న వస్తున్నాయి. అనంతపురం కక్కలపల్లి ప్రైవేట్‌ మార్కెట్‌కు రోజుకు మూడువేల టన్నులకు పైగానే కాయలు వస్తున్నాయి. కళ్యాణదుర్గం మార్కెట్‌కు కూడా బాగానే వస్తున్నాయి. ఎగుమతులు లేకపోవడం ధరలు లేకపోవడానికి కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. కోలారు, మదనపల్లి, కలికిరి మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి.
టమోటాకు ధరలు లేకపోవడంతో ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల రైతులు పంటను పారబోస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎకరాకు రూ.లక్ష వరకు ఖర్చుచేస్తున్నారు. కట్టెల మీద సాగుకు మరో రూ.50వేలు అదనంగా అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ధరలతో కనీసం పెట్టుబడుల్లో సగం కూడా రావడం గగనమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ధరలు లేకపోవడంతో కొంతమంది పంటను తోటల్లోనే వదిలేస్తున్నారు. మరి కొందరు పశువుల మేతకు, రోడ్లపై పారబోస్తున్న ఘటనలు ఇటీవల కళ్యాణదుర్గం, కదిరి ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి.
రెండు ఎకరాల్లో పంట సాగు చేశా. ప్రస్తుతం ఐదో కటింగ్‌ పడింది. 265 బాక్సులు అయ్యాయి. 15 కిలోల బాక్సు రూ.170తో అమ్ముడుపోయాయి. సీజన్‌ మొదట్లో మంచి రేటు ఉంటుందని ముందస్తుగానే సాగు చేశా. ముందుసారి ఈ సమయంలో ధరలు బాగా పలికాయి. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. కనీసం బాక్సు రూ.250పైనే పలికితేనే పెట్టుబడులు దక్కుతాయి. ఈ రేట్లతో పెట్టుబడులు ఎల్లడం కష్టమే.
మూడు ఎకరాల్లో పంట సాగు చేశా. ఎకరానికి రూ.లక్షపైగా పెట్టుబడులు పెట్టాను. ముందుసారి ఈ సయమంలో మంచి రేట్లు పలికాయి. గతంలో మాదిరిగానే రేట్లు ఉంటాయని ముందుగా పెట్టాను. అనుకున్నట్లు జరగలేదు. ఇప్పుడు రెండో కటింగ్‌ పడింది. 190 బాక్సులు అయ్యాయి. 160 బాక్సులు రూ.140తో..మిగిలినవి, రూ.80తో అమ్ముడుపోయాయి. ముందుముందు ధర వస్తుందేమోనని ఎదురుచూస్తున్నా. కనీసం బాక్సు రూ.300 పలికితేనే లాభం ఉంటుంది. ఖర్చుల రూపంలో రూ.100 పోయినా..మిగులులో పెట్టుబడులు పోనూ కాస్త లాభం చేకూరే వీలుంటుంది.