Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

చరిత్ర సృష్టించిన విండీస్ బౌలర్..

Author Neti Sudiksha | 28 Jul 2026, 01:08 PM | Sports
చరిత్ర సృష్టించిన విండీస్ బౌలర్..

ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా పాకిస్థాన్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో విండీస్ ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ అదిరిపోయే బౌలింగ్‌తో ప్రపంచ రికార్డును సృష్టించాడు. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో తన తొలి ఐదు ఓవర్లలో గ్రీవ్స్ 27 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా తీయలేదు. అయితే తన సెకండ్ స్పెల్‌లో మాత్రం అద్భుతం చేశాడు.
గ్రీవ్స్.. తన రెండో స్పెల్‌లో ఒక పరుగు కూడా ఇవ్వకుండా వరుసగా ఐదు ఓవర్లలో ఒక్కో వికెట్ చొప్పున మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో వరుసగా ఐదు ఓవర్లు మెయిడిన్ చేసిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. 2016లో జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ నెలకొల్పిన వరుసగా నాలుగు వికెట్ల మెయిడిన్ల రికార్డును తాజాగా గ్రీవ్స్ అధిగమించాడు. అలానే టెస్టుల్లో గ్రీవ్స్‌కు ఇది తొలి ఐదు వికెట్ల ఘనత కావడం విశేషం.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మూడో రోజు పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకు ఆలౌటైంది. 244/4 స్కోరుతో ఉండగా తన రెండో స్పెల్‌ను ప్రారంభించిన జస్టిన్ గ్రీవ్స్.. పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తన వరుస ఐదు ఓవర్లలో షాన్ మసూద్ (109), ఆమీర్ జమాల్ (3), అలీ ఉస్మాన్ (0), మహ్మద్ రిజ్వాన్ (12), మహ్మద్ అబ్బాస్ (0)లను పెవిలియన్‌కు పంపాడు.