Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

పావలా శ్యామలకు నేడు అంతిమ వీడ్కోలు..

Author Neti Sudiksha | 29 Jul 2026, 12:11 PM | Cinema
పావలా శ్యామలకు నేడు అంతిమ వీడ్కోలు..

టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామలకు నేడు (జులై 29) అంతిమ వీడ్కోలు పలకనున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాల పాటు తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె మరణం చిత్రసీమను విషాదంలో ముంచెత్తింది. నేడు హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వనస్థలిపురంలోని రెడీ టూ సర్వ్ ఆశ్రమంలో ఉంచిన పావలా శ్యామల పార్థివదేహాన్ని ఉదయం మహాప్రస్థానానికి తరలించనున్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆమె భౌతికకాయం మహాప్రస్థానానికి చేరుకోగా, సినీ ప్రముఖులు, అభిమానులు చివరిసారిగా నివాళులు అర్పించేందుకు దాదాపు గంటపాటు అక్కడే ఉంచనున్నారు.
ఉదయం 11 గంటల త‌ర్వాత నుంచి అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ప్రతినిధులు, పలువురు సినీ నటులు, దర్శకులు, నిర్మాతలు హాజరై పావలా శ్యామలకు తుది వీడ్కోలు పలకనున్నారు. అంత్యక్రియల ఏర్పాట్లను నటి కరాటే కళ్యాణి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గ‌త కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పావలా శ్యామల చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. తెల్లవారుజామున 1.52 గంటలకు గుండెపోటుతో మరణించినట్లు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఆమె మరణవార్త తెలిసిన వెంటనే సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.