Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

కేంద్ర మంత్రి జార్జ్ కురియన్‌ రాజీనామా- ఆమోదించిన రాష్ట్రపతి

Author Neti Sudiksha | 23 Jun 2026, 12:23 PM | NATIONAL
కేంద్ర మంత్రి జార్జ్ కురియన్‌ రాజీనామా- ఆమోదించిన రాష్ట్రపతి

రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం ముగియడంతో కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. వెంటనే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన రాజీనామాను ఆమోదించారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖతో పాటు మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖల సహాయ మంత్రిగా జార్జ్ కురియన్ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.

ప్రధాని మోదీతో భేటీ అనంతరం రాజీనామా
జార్జ్ కురియన్‌ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. రాజ్యసభ సభ్యుడిగా జార్జ్ కురియన్ పదవీకాలం ఈనెల 21తో ముగిసింది. దీంతో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈసారి ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఆయనకు మళ్లీ అవకాశం ఇవ్వకుండా అధిష్ఠానం ఇతర నాయకులను ఎంపిక చేసింది. పార్టీ తరఫున తరుణ్ చుగ్, రజనీశ్ అగర్వాల్​ను అభ్యర్థులుగా ప్రకటించింది. దీంతో జార్జ్ కురియన్‌ కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగడం ఖాయమైంది. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడానికి ముందు జార్జ్ కురియన్‌, ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. అనంతరం తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ప్రధానమంత్రి సిఫార్సు మేరకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 75(2) ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజీనామాను ఆమోదించారు. ఇక మరో మంత్రి రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూను కూడా ఈ సారి పార్టీ రాజ్యసభకు నామినేట్‌ చేయలేదు.

కేరళ రాజకీయాల్లోకి తిరిగి?
మంత్రివర్గం నుంచి వైదొలిగిన అనంతరం జార్జ్ కురియన్ మళ్లీ పార్టీ సంస్థాగత బాధ్యతల్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కేరళలో చురుకుగా పనిచేయాలన్న తన ఆసక్తిని ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి తెలియజేసినట్లు సమాచారం. అయితే ఆయనకు జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తారా? లేక రాష్ట్ర బీజేపీలో కీలక పదవి ఇస్తారా? అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై పార్టీ నాయకత్వం త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మోదీ ప్రభుత్వంలో మంత్రి బాధ్యతలు
జార్జ్ కురియన్ రాజీనామాతో కేంద్ర మంత్రిమండలిలో క్రైస్తవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 1980లో బీజేపీలో చేరిన ఆయన పార్టీలో వివిధ పదవులను నిర్వహించారు. జార్జ్ కురియన్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు, కోర్ కమిటీ సభ్యుడు, పార్టీ అధికార ప్రతినిధి వంటి కీలక పదవులను నిర్వహించారు. అలాగే వాజ్​పేయీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న ఓ రాజగోపాల్ వద్ద ప్రత్యేక విధుల అధికారి (ఓడీఎస్​)గా కూడా పనిచేశారు. ఈ అనుభవం కారణంగానే ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. జార్జ్ కురియన్ 2024 జూన్ 9న మోదీ ప్రభుత్వంలో మైనారిటీ వ్యవహారాలు, మత్స్య, పశుసంవర్ధక శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రి అయిన కొద్దికాలానికే ఆయన మధ్యప్రదేశ్ నుంచి రాష్ట్రసభకు ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంజిరపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓటమిని చవిచూశారు.

జార్జ్ కురియన్ రాజీనామాతో కేంద్ర మంత్రివర్గంలో కేరళకు చెందిన ప్రాతినిధ్యం ఇప్పుడు కేవలం సురేశ్​ గోపికి మాత్రమే పరిమితమైంది. కేరళలో క్రైస్తవ వర్గాలకు చేరువ కావాలన్న వ్యూహంలో భాగంగా బీజేపీ ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంది. అయితే కంజిరప్పల్లి ఎన్నికల్లో ఓటమి, రాష్ట్రసభలో రెండో అవకాశం దక్కకపోవడం ఆయన పార్లమెంటరీ రాజకీయ ఆశయాలకు ఎదురుదెబ్బగా మారింది. అయినప్పటికీ కేరళ బీజేపీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.