Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

లీక్ చేయడానికి ఇంకా ఏదైనా పరీక్ష మిగిలుందా..

Author Neti Sudiksha | 27 Jun 2026, 09:43 PM | NATIONAL
లీక్ చేయడానికి ఇంకా ఏదైనా పరీక్ష మిగిలుందా..

దేశంలో లీక్ చేయడానికి ఇంకా ఏవైనా పరీక్షలు మిగిలున్నాయా అంటూ బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే నీట్ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, ఇప్పుడు మహారాష్ట్రలో టెట్ పరీక్ష పేపర్ లీకవ్వడం కలకలం సృష్టిస్తోంది. వీటిలో నీట్ జాతీయస్థాయి పరీక్ష కాగా, మహారాష్ట్ర టెట్ రాష్ట్రస్థాయి పరీక్ష. ఇటు దేశంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీయే, అటు మహారాష్ట్రలో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి ప్రభుత్వాలే అధికారంలో ఉండటం విశేషం.
ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీ ఘటనల్లో బీజేపీ నిర్లక్ష్యంపై కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ), కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘మరో పేపర్ లీకేజీ. మరో పరీక్ష రద్దు. ఈసారి మహారాష్ట్ర టెట్. దేశంలోని విద్యావ్యవస్థ, పరీక్షా నిర్వహణ వ్యవస్థ ఒక దోపిడీ వ్యవస్థగా మారింది. దేశంలోని ప్రతి యువకుడు అభద్రతతో ఉన్నాడు. ఇది పేపర్ లీకేజీ కాదు. యువత భవిష్యత్తును కొల్లగొట్టడం’’ అంటూ రాహుల్ గాంధీ స్పందించారు. శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నేత అమోలో మాటెలె కూడా టెట్ పేపర్ లీకేజీపై విమర్శలు గుప్పించారు. ఇంతకుముందు సీబీఎస్‌ఈ, నీట్ యూజీ పేపర్లు లీకవ్వగా, ఇప్పుడు టీచర్ల అర్హత పరీక్ష పత్రం లీకైందన్నారు. మిగతా పోటీ పరీక్షల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇటు పేపర్లు లీకవుతుంటే ప్రభుత్వం మాత్రం ఇతర పార్టీల్ని కొల్లగొట్టి, ఎంపీల్ని చేర్చుకోవడంలో బిజీగా ఉందన్నారు.