Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

రాష్ట్రంలో వారం రోజుల‌పాటు భారీ వ‌ర్షాలు..

Author Neti Sudiksha | 27 Jun 2026, 10:03 PM | TELANGANA
 రాష్ట్రంలో వారం రోజుల‌పాటు భారీ వ‌ర్షాలు..

నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి రోజులు గడుస్తున్నా వర్షాలు లేక తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు అందించింది. రుతుపవనాలు ఆలస్యంగా పుంజుకోవడంతో రాష్ట్రంలో వర్షపాతం కొరత ఏర్పడింది. అయితే తాజాగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, దీని ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా రానున్న ఏడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టంచేసింది.
వాతావరణ కేంద్రం తాజా అంచనాల ప్రకారం.. ఇవాళ‌ ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీచేశారు. వీటితోపాటు హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, కుమురం భీమ్ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడతాయని తెలిపింది. ఈ సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా వర్షసూచన నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీచేసింది. జూలై 2వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని పేర్కొన్న‌ది. ఉత్తర, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకటి రెండు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అదే సమయంలో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే నమోదయ్యే సూచనలు ఉన్నాయని వివరించింది. ఇక రాజధాని హైదరాబాద్‌లోనూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉక్కపోత నుంచి నగరవాసులకు ఉపశమనం లభించింది.