Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

హెర్నియా సర్జ్–2026 ఘన ప్రారంభం.. దేశవ్యాప్తంగా సర్జన్ల సదస్సు

Author Neti Sudiksha | 18 Jul 2026, 10:00 PM | వరంగల్
హెర్నియా సర్జ్–2026 ఘన ప్రారంభం.. దేశవ్యాప్తంగా సర్జన్ల సదస్సు

వరంగల్, జూలై 18 (సుదీక్ష న్యూస్): వరంగల్‌లోని వాసవి హాస్పిటల్ డైరెక్టర్, హెర్నియా సర్జ్–2026 ఆర్గనైజింగ్ చైర్మన్ డా. ఎ. సుధాకర్ సమక్షంలో దేశవ్యాప్త హెర్నియా శస్త్రచికిత్స నిపుణుల మహాసదస్సు “హెర్నియా సర్జ్–2026” శనివారం ఘనంగా ప్రారంభమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖ సర్జన్లు, వైద్య నిపుణులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ సదస్సుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, గత రెండు దశాబ్దాలుగా హెర్నియా శస్త్రచికిత్స రంగంలో మినిమల్ యాక్సెస్ సర్జరీ, లాపరోస్కోపిక్, రోబోటిక్ సర్జరీలు, అబ్డోమినల్ వాల్ రీకన్‌స్ట్రక్షన్ వంటి ఆధునిక సాంకేతికతలతో విశేష మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఈ సదస్సు ద్వారా అత్యాధునిక శస్త్రచికిత్స విధానాలు, క్లిష్టమైన కేసుల నిర్వహణ, తాజా పరిశోధనలపై నిపుణులు తమ అనుభవాలను పంచుకోనున్నట్లు పేర్కొన్నారు.
రెండు రోజుల పాటు కొనసాగే ఈ మహాసదస్సులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిపుణుల ఉపన్యాసాలు, ప్యానెల్ చర్చలు, ప్రత్యక్ష శస్త్రచికిత్స ప్రదర్శనలు, కేస్‌ ఆధారిత శాస్త్రీయ చర్చలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా యువ సర్జన్లకు ఆధునిక వైద్య సాంకేతికతపై అవగాహన పెంపొందించేందుకు ఈ సమావేశం ఉత్తమ వేదికగా నిలుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అసోసియేషన్ ఆఫ్ మినిమల్ యాక్సెస్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (AMASI) నాయకత్వానికి, దేశం నలుమూలల నుంచి విచ్చేసిన వైద్య నిపుణులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ నగర ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తూ సదస్సును విజయవంతం చేయాలని కోరారు.
సదస్సు నిర్వహణలో ఆర్గనైజింగ్ చైర్మన్ డా. ఎ. సుధాకర్‌తో పాటు ఆర్గనైజింగ్ కో-చైర్మన్లు డా. బి. రాజ్ సిద్ధార్థ్, డా. శ్రీనివాస్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. సుబ్రహ్మణ్యేశ్వర బాబు, కో-సెక్రటరీలు డా. వెంకటన్న ఎం., డా. ఎన్. ప్రశాంత్ రెడ్డి, డా. రూపా బి., డా. నరేంద్ర హజారిక, ట్రెజరర్ డా. గోపి తుపాకర్ మరియు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి సదస్సు విజయవంతానికి కృషి చేశారు.