Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

రోజంతా కూర్చుని ప‌నిచేసేవారు గంట‌కోసారి 5 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి..

Author Neti Sudiksha | 23 Jul 2026, 02:09 PM | HEALTH
రోజంతా కూర్చుని ప‌నిచేసేవారు గంట‌కోసారి 5 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి..

రోజంతా ఎక్కువసేపు ఒకేచోట కూర్చుని పనిచేయడం ఆధునిక జీవనశైలిలో సాధారణమైపోయింది. అయితే ఈ అలవాటు ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని ఇప్పటికే అనేక అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. తాజాగా నిర్వహించిన పరిశోధన ప్రకారం, ప్రతి గంటకు ఐదు నిమిషాల పాటు నడవడం ద్వారా ఈ ప్రమాదాలను కొంతవరకు తగ్గించడంతోపాటు అలసటను తగ్గించి మానసిక ఉల్లాసాన్ని పెంచుకోవచ్చని తేలింది. ఈ అధ్యయన ఫలితాల‌ను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో ప్రచురించారు. ఇందులో గంటకోసారి ఐదు నిమిషాల నడక విరామం తీసుకోవడం ఆచరణలో సాధ్యమే కాకుండా, ఆరోగ్యపరంగా కూడా అత్యంత ప్రయోజనకరమైన పద్ధతిగా గుర్తించారు. అంతేకాకుండా, ఈ చిన్న విరామాలు ఉద్యోగుల పనితీరును ఏమాత్రం దెబ్బతీయలేదని పరిశోధకులు వెల్లడించారు.
ఎక్కువ‌సేపు క‌ద‌ల‌కుండా ఉంటే..
ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం ప్రజారోగ్యానికి పెద్ద సవాలుగా మారిందని పరిశోధకులు పేర్కొన్నారు. దీనివల్ల ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు మాత్రమే కాకుండా అకాల మరణ ప్రమాదం కూడా పెరిగే అవకాశం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో తరచూ లేచి కదలడం వల్ల కలిగే ప్రయోజనాలను వాస్తవ పరిస్థితుల్లో అంచనా వేయడానికి ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ పరిశోధనలో భాగంగా 19,300 మందికి పైగా ఉద్యోగుల వివరాలను విశ్లేషించారు. వారిలో సుమారు 11,484 మంది వరుసగా 14 రోజుల పాటు ప్రతి 30 నిమిషాలకు, 60 నిమిషాలకు లేదా 120 నిమిషాలకు ఒకసారి ఐదు నిమిషాల నడక విరామాన్ని స్వచ్ఛందంగా ఎంచుకుని పాటించారు. దీనికి ముందు ఏడు రోజుల పాటు వారు తమ సాధారణ దినచర్యనే కొనసాగించారు.
వాకింగ్‌తో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు..
21 రోజుల పరిశోధన కాలంలో ప్రతిరోజూ నిర్వహించిన సర్వే ద్వారా పాల్గొనేవారిలో అలసట, మానసిక స్థితి, పనితీరులో వచ్చిన మార్పులను పరిశీలించారు. మూడు రకాల విరామాలూ ఆచరణలో సాధ్యమేనని, ప్రజలు సులభంగా అంగీకరించగలర‌ని ఫలితాలు వెల్లడించాయి. అయితే ప్రతి రెండు గంటలకు ఒకసారి విరామం తీసుకోవడం అమలు పరంగా సులభమైనప్పటికీ, ఆరోగ్య ప్రయోజనాల పరంగా తక్కువ ప్రభావాన్ని చూపింది. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకున్నవారిలో అలసట తగ్గడం, మానసిక ఉల్లాసం పెరగడం అత్యధికంగా కనిపించినప్పటికీ, దానిని క్రమం తప్పకుండా పాటించడం చాలామందికి కష్టంగా అనిపించింది. ఈ నేపథ్యంలో ప్రతి గంటకు ఒకసారి ఐదు నిమిషాల నడక విరామం తీసుకోవడం ఉత్తమ ఎంపికగా పరిశోధకులు పేర్కొన్నారు.