Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

హోమియోపతి మందులు తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి

Author Neti Sudiksha | 23 Jul 2026, 03:08 PM | HEALTH
హోమియోపతి మందులు తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి

చాలా మంది నెలల తరబడి హోమియోపతి మందులు వాడినా ఫలితం లేదని భావిస్తుంటారు. అయితే, హోమియోపతి నిపుణుల ప్రకారం.. ఇందుకు కారణం చాలా సందర్భాల్లో మందులు కాదు.. వాటిని సరిగ్గా వాడకపోవడం, వైద్యుల సూచనలు పాటించకపోవడం, ఆహారపు అలవాట్లు, జీవనశైలిలోని పొరపాట్లే. సరైన నియమాలు పాటిస్తేనే హోమియోపతి చికిత్స మెరుగైన ఫలితాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మందులు తీసుకునే విధానం చాలా ముఖ్యం
హోమియోపతి నిపుణుల ప్రకారం.. ప్రతి మందును ఒకే విధంగా తీసుకోరు. కొన్ని మందులను ఖాళీ కడుపుతో, మరికొన్నింటిని భోజనానికి 20 నిమిషాల ముందు లేదా తర్వాత తీసుకోవాలి. అలాగే మందు వేసుకున్న వెంటనే టీ, కాఫీ లేదా నీళ్లు తాగడం వల్ల మందు ప్రభావం తగ్గే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు.
మందులను సరిగ్గా భద్రపరచాలి
హోమియోపతి మందులను ఎండ, వేడి, ఘాటైన వాసనలు ఉన్న ప్రదేశాలకు దూరంగా భద్రపరచాలి. మందు సీసా మూతను ఎప్పుడూ మంచిగా మూసి ఉంచాలి. అలాగే మాత్రలను చేతితో కాకుండా సీసా మూత లేదా శుభ్రమైన చెంచాతో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆహారంలో కూడా జాగ్రత్త అవసరం
కొన్ని హోమియోపతి మందులు తీసుకునే సమయంలో ఉల్లిపాయ, వెల్లుల్లి, యాలకులు, ఇంగువ, అల్లం వంటి ఘాటైన వాసన ఉన్న పదార్థాలను తగ్గించాలని వైద్యులు సూచిస్తారు. అలాగే వేయించిన పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం కూడా చికిత్సపై ప్రభావం చూపవచ్చు.
జీవనశైలి కూడా కీలకమే
పిల్లలు, పెద్దలు రాత్రిళ్లు ఎక్కువసేపు మొబైల్ వాడటం, సరైన నిద్ర లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి అలవాట్లు కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు అంటున్నారు. రోజూ ఉదయం యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయడం శరీరానికి మేలు చేస్తుందని సూచిస్తున్నారు.
వైద్యుల సలహా లేకుండా మందులు వాడొద్దు
ఇటీవల చాలా మంది ఇంటర్నెట్‌లో చూసి స్వయంగా హోమియోపతి మందులు వాడుతున్నారు. కానీ నిపుణుల సలహా లేకుండా మందులు తీసుకోవడం వల్ల సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.