Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

సీఎం విజయ్ చివరి సినిమాకి షాక్..

Author Neti Sudiksha | 24 Jul 2026, 11:20 AM | Cinema
సీఎం విజయ్ చివరి సినిమాకి షాక్..

తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చివరి చిత్రం ‘జన నాయగన్’ ప్రపంచవ్యాప్తంగా జూలై 23న గ్రాండ్‌గా విడుదలైంది. రాజకీయాల్లో పూర్తిస్థాయిలో అడుగుపెట్టే ముందు విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలకు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద తొలి రోజు వసూళ్లు నమోదు కాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.సెన్సార్ జాప్యం కారణంగా దాదాపు ఏడు నెలలు వాయిదా పడిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదలైన తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో ఉత్సాహం కనిపించింది. తమిళనాడులో చాలా థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించినప్పటికీ, ఇతర రాష్ట్రాల్లో మాత్రం అదే స్థాయి స్పందన కనిపించలేదు.
భారత్‌లో తొలి రోజు ఈ చిత్రం సుమారు రూ.41 కోట్ల నెట్, దాదాపు రూ.48 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలుగు, హిందీ డబ్బింగ్ వెర్షన్లు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఈ రెండు భాషల్లో కలిపి కేవలం రూ.3 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే నమోదైనట్లు సమాచారం. విజయ్‌కు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉన్నప్పటికీ, ప్రమోషన్ల లోపం ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఓవర్సీస్ మార్కెట్‌లో మాత్రం ‘జన నాయగన్’ పర్వాలేదనిపించే ప్రదర్శన చేసింది. ఉత్తర అమెరికాలో ప్రీమియర్లతో కలిపి తొలి రోజే 2 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయగా, ఇతర అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మరో 1 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వచ్చింది. మొత్తంగా విదేశాల్లో 3.2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.30 కోట్ల గ్రాస్) రాబట్టిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు దాదాపు రూ.78.27 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది.