Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి.. విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలి

Author Neti Sudiksha | 24 Jul 2026, 02:02 PM | హైదరాబాద్
కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి.. విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలి

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై జరిగిన దాడులు అమానుషమని కేటీఆర్ పేర్కొన్నారు. యువత జవాబుదారీతనం కోరుతోందని.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. యువతపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద కేటీఆర్ నిరసన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఢిల్లీలో విద్యార్థులు, యువత పోరాటానికి బీఆర్‌ఎస్‌ తరఫున కేటీఆర్ సంఘీభావం ప్రకటించారు. 25 రోజులుగా ఢిల్లీలో పార్టీలకు అతీతంగా యువత పోరాడుతోందన్నారు. యువతపై జరుగుతున్న దాడులను దారుణమని తీవ్రంగా ఖండించారు. ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే ప్రధాని మోదీ పెట్టుకున్నారని.. ఈ జనరేషన్‌ చావుకు, ఐటీ, ఈడీ సోదాలకు భయపడేది కాదన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ.. మేక్ ఇన్ ఇండియా అడిగితే లీక్ ఇన్ ఇండియా ఇచ్చారంటూ సెటైర్లు వేశారు. న్యాయం చేయాలని విద్యార్థులు అడుగుతున్నారని, వారికి అండగా నిలబడతామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీపై కొట్లాడితే చోటాభాయ్‌కు ఎందుకు కోపం వస్తుందో అర్థం కావడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ చురకలు అంటించారు. మోదీ అంటే రేవంత్‌కు ఎందుకంత భయమంటూ ప్రశ్నించారు. పాత కేసులు తోడుతారని సీఎం భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.