Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్‌లో విచిత్ర మోసం..

Author Neti Sudiksha | 29 Jul 2026, 01:39 PM | Sports
ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్‌లో విచిత్ర మోసం..

ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్‌లో వెలుగు చూసిన ఓ విచిత్ర మోసం క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. సాల్ట్‌బర్న్ క్రికెట్ క్లబ్ సెకండ్ ఎలెవన్ జట్టుకు చెందిన ఓ ఫీల్డర్.. బంతి ప్రత్యర్థి బ్యాటర్ బ్యాట్‌కు తాకకపోయినా వేళ్లతో చిటికె వేసి శబ్దం సృష్టించాడు. నిజంగానే బ్యాట్‌కు బంతి తగిలిందని భ్రమపడిన అంపైర్లు బ్యాటర్లను క్యాచ్ ఔవుట్‌గా ప్రకటించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో సాల్ట్‌బర్న్ క్లబ్ ఆటగాడు బ్రియాన్ డివైన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
బ్రియాన్ డివైన్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ బంతి బ్యాట్‌ను దాటి వెళ్లే సమయంలో చిటికె వేస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో అతడిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్‌తో పోలుస్తూ..'క్లిక్కీ పాంటింగ్' అని వ్యంగ్యమైన కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు మిడిల్స్‌ బ్రో క్లబ్ సెకండ్ ఎలెవన్ జట్టు కెప్టెన్ స్పందిస్తూ.. ఇలాంటి పనుల వల్ల గతంలో ఎంతోమంది యువ ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారని ఆరోపించారు. ఈ వివాదం ముదరడంతో నార్త్ యార్క్‌షైర్ అండ్ సౌత్ డర్హమ్ క్రికెట్ లీగ్ దీనిపై అధికారికంగా దర్యాప్తునకు ఆదేశించింది.