Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఈసారి గవర్నమెంట్ స్కూల్​ యూనిఫాం మారింది - కొత్తవి ఎలా ఉండనున్నాయంటే?

Author Neti Sudiksha | 14 Jun 2026, 12:10 PM | TELANGANA
ఈసారి గవర్నమెంట్ స్కూల్​ యూనిఫాం మారింది - కొత్తవి ఎలా ఉండనున్నాయంటే?

ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించనున్న ఏకరూప దుస్తుల రంగులు, డిజైన్లు మారనున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాదిలో స్వల్పంగా కొన్ని మార్పులు చేశారు. గతేడాది వేసవి సెలవుల్లోనే ఏకరూప దుస్తులు సిద్ధం చేసి, పాఠశాలల పునః ప్రారంభం రోజున అందజేశారు. కానీ ఈ సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా చాలా పాఠశాలలకు వస్త్రాలు సరఫరా అవ్వలేదు. అయితే ఈసారి నీలం రంగుతో ఉన్న డిజైన్లతో బాల బాలికలకు ఏకరూప దుస్తులు అందించనున్నట్లు ప్రభుత్వం మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.

వస్త్రాలు ఎలా ఉన్నాయంటే? : ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి బాలురకు నీలం రంగులో ఉన్న చొక్కాలు, నిక్కర్లు, ప్యాంట్లు, బాలికలకు ఫ్రాక్​లు, వేయిస్ట్ ​కోట్​, పంజాబీ డ్రెస్​లు అందించనున్నారు. చొక్కాలు, లాంగ్​ఫ్రాక్​లకు పట్టీలు, భుజాలపై కప్స్​ వంటి ప్యాచ్​వర్క్​ లేకుండా డిజైన్ చేశారు. దీనివల్ల సులభంగా కుట్టగలుగుతారు. స్వయం సహాయక మహిళలకు పని తేలికవుతుంది.

Govt School Uniform Change
నీలి రంగులోకి మారిన స్కూల్ ఏకరూప దుస్తులు (Eenadu)
తరగతుల వారీగా డ్రెసెస్​ ఇలా : ఒకటి నుంచి ఐదో తరగతి చదివే బాలురకు చొక్కా - నిక్కర్లు, ఆరు నుంచి పన్నెండో తరగతి చదివే బాలురకు చొక్కా - ప్యాంట్లు అందించనున్నారు. ఒకటి నుంచి మూడో తరగతి చదివే బాలికలకు లాంగ్ ఫ్రాక్​-చొక్కా, నాలుగు నుంచి ఐదో తరగతి బాలికలకు చొక్కా - స్కర్ట్​, ఆరు నుంచి పన్నెండో తరగతి బాలికలకు పంజాబీ డ్రెస్​ అంటే టాప్​ నుంచి బాటమ్​తో చున్నీ లేకుండా ఉంటుంది. ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ఇలాంటి వస్త్రాలను విద్యార్థులకు అందించనున్నారు.

ఇవి కూడా చదవండి

'పాఠశాల విద్యా శాఖ నుంచి ఏకరూప దుస్తుల రంగులు, డిజైన్లకు సంబంధించిన ఉత్తర్వులు అందాయి. వస్త్రం రాగానే స్వయం సహాయక సంఘాలతో వాటిని కుట్టించి పంపిణీ చేస్తాం' - జయదేవ్​ ఆర్య, డీఆర్డీఏ పీడీ, సిద్దిపేట

జూన్​ 15న విద్యాసంస్థల పునః ప్రారంభం : ఈ ఏడాది విద్యా సంవత్సరం జూన్​ 15 సోమవారం నుంచి మొదలుకానుంది. వాస్తవానికి జూన్​ 12న విద్యాసంస్థలు ప్రారంభించాల్సి ఉంది. కానీ 13 రెండో శనివారం, 14న ఆదివారం కావడంతో షెడ్యూల్​లో మార్పులు చేశారు. జూన్​ 13 రెండో శనివారం సెలవుకు బదులుగా జులై 11న తరగతులు నిర్వహించనున్నారు.

ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ : రాష్ట్రవ్యాప్తంగా ఈ (2026-27) అకాడమిక్ ఇయర్ నుంచి 2,769 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్​ నికోలస్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. క్యూర్ ​(క్యూర్ - కోర్ అర్బన్ ఎకానమీ) పరిధిలోని 529 చోట్ల యూకేజీ విద్యను అమలు చేయనున్నారు.

బ్రేక్​ఫాస్ట్​, మధ్యాహ్న భోజనం అందించే ఏర్పాటు : ఈసారి ప్రీ ప్రైమరీ విద్యలో చేరిన పిల్లల నుంచి జూనియర్​ కాలేజీ విద్యార్థుల వరకు ఉదయం బ్రేక్​ఫాస్ట్​తో పాటుగా మధ్యాహ్నం భోజనం అందించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకే చోట అల్పాహారం చేయించి అన్ని పాఠశాలలకు పంపేందుకు వీలుగా సెంట్రలైజ్డ్ కిచెన్​ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఏపీలో ఇప్పటికే హరే రామ సంస్థ పలు పాఠశాలలకు మధ్యాహ్న భోజనం వండి పంపుతున్నారు. ఈ విధానాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని ఇంటర్మీడియెట్ కళాశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించేలా ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.