Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

శివారాధన చేస్తే కేతు గండాలు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయా?

Author Neti Sudiksha | 14 Jun 2026, 12:21 PM | Bhakti
శివారాధన చేస్తే కేతు గండాలు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయా?

నవగ్రహ దోషాలు పోగొట్టుకోవడానికి నవగ్రహాలతో పాటు శివుని కూడా ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. శివారాధనకు సోమవారంతో పాటు శనివారం కూడా విశిష్టమైనదే! అందునా ఆ శనివారం మాస శివరాత్రితో కలిసి ఉంటే అది మరీ ప్రత్యేకం. అత్యంత అరుదుగా వచ్చే శనివారం మాస శివరాత్రి రోజు చేసే శివారాధనకు ఎలాంటి ఫలితం ఉంటుంది? అసలు మాస శివరాత్రి అంటే ఏమిటి? శివుని పూజకు మాస శివరాత్రి ఎందుకంత ప్రత్యేకం? ఈ వివరాల కోసం ఈ కథనం పూర్తిగా చదవండి.

మాస శివరాత్రి అంటే ఏమిటి?
ప్రతినెలా ఒక మాస శివరాత్రి వస్తుంది. వ్యాస మహర్షి రచించిన శివ మహా పురాణం ప్రకారం అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి తిథి పరమేశ్వరుని జన్మతిథిగా చెప్తారు. అందుకే ప్రతి నెలా పరమేశ్వర ప్రీత్యర్ధం మాస శివ రాత్రిని విశేషంగా జరుపుకుంటాం. తెలుగు పంచాంగం ప్రకారం ఫాల్గుణ మాసం నుంచి పుష్య మాసం వరకు ఉన్న 11 మాసాల్లో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి రోజును మాస శివరాత్రిగా జరుపుకుంటాం. అదే మాఘ మాసంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మహా శివరాత్రిగా జరుపుకుంటాం. అయితే మాస శివరాత్రి జరుపుకోవాలంటే చతుర్దశి తిథి సాయంత్రం సమయంలో తప్పనిసరిగా ఉండాలి. ఈ సందర్భంగా ఈసారి మాసశివరాత్రి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు శివారాధన ఎలా చేయాలి? అనే విషయాలు చూద్దాం.

మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి?
పరమశివుడు లయ కారకుడు. అంటే సృష్టిని అంతం చేసేవాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం లయానికి కారకుడు కేతువు. అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి రోజు చంద్రుడు క్షీణంగా ఉంటాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడు మనః కారకుడు. అంటే ఒక మనిషి మానసికంగా సంతోషంగా ఉండాలంటే జాతకంలో చంద్ర బలం బాగుండాలి. అమావాస్య ముందు చతుర్దశి రోజు చంద్రుడు క్షీణించి ఉన్నప్పుడు కేతు ప్రభావం వ్యక్తులపై ఎక్కువగా ఉంటుంది. ముందే చెప్పుకున్నట్లు కేతువు లయం అంటే మృత్యు కారకుడు కాబట్టి చంద్రుడు బలహీనంగా ఉన్న సమయంలో మానవుల ఆరోగ్యాలపై కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

అమావాస్యకు అనారోగ్యానికి సంబంధం ఏమిటి?
సాధారణంగా అమావాస్యకు ముందు ఊహించని అనారోగ్య సమస్యలు ఏర్పడడం, పెను ప్రమాదాలు సంభవించడం, ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడడం వంటివి అధికంగా జరుగుతుంటాయి. అంతేకాదు చంద్ర బలం తక్కువగా ఉన్న సమయంలో కేతు ప్రభావం పెరిగి మానసిక సమస్యలు పెరగడానికి కేతు గ్రహ దోష ప్రభావాలే కారణం!

ఇవి కూడా చదవండి

కేతు గండాలను పోగొట్టే మాస శివరాత్రి పూజ
అమావాస్య ముందు అధికంగా ఉండే కేతు గండాల నుంచి బయట పడటానికి శాస్త్రం మాస శివరాత్రి పూజకు ప్రాధాన్యాన్ని ఇచ్చింది. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు కదా! అల్పాయుష్కుడైన మార్కండేయుడు శివుని ఆరాధించి సంపూర్ణ ఆయుష్షును పొందిన కథ మనందరికీ తెలిసిందే! అందుకే మాస శివరాత్రి రోజు శివుని నియమ నిష్టలతో ఆరాధిస్తే ఎలాంటి ఆపదాలైనా తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది.

మాస శివరాత్రి ఎప్పుడు?
తెలుగు పంచాంగం ప్రకారం జూన్ 13, శనివారం అధిక జ్యేష్ఠ మాసం బహుళ చతుర్దశి సందర్భంగా ఈ రోజును మాసశివరాత్రిగా జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.

మాసశివరాత్రి పూజకు శుభసమయం
జూన్ 13, శనివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల లోపు మాసశివరాత్రి పూజకు శుభసమయం.

మాస శివరాత్రి పూజా విధానం
మాస శివరాత్రి రోజు ఉదయాన్నే నిద్ర లేచి శుచియై ఇంట్లో పూజాదికాలు ముగించుకొని శివాలయానికి వెళ్లి 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఆ రోజంతా కేవలం నీటిని మాత్రమే తాగుతూ ఉపవాసం చేయాలి. సాయంత్రం ప్రదోష వేళలో తిరిగి స్నానం చేసి శివాలయంలో శివలింగానికి పంచామృతాలతో, గంగా జలంతో అభిషేకం జరిపించి, అష్టోత్తర శత నామాలతో శివయ్యని అర్చించాలి. శివయ్యకు పండ్లు, కొబ్బరికాయలు, పులిహోర వంటి నైవేద్యాలు సమర్పించాలి. అనంతరం ఇంటికి వచ్చి ఉపవాసాన్ని విరమించవచ్చు.