Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఖచ్చితమైన ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం

Author Neti Sudiksha | 18 Jun 2026, 12:35 PM | TELANGANA, హన్మకొండ
ఖచ్చితమైన ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం

ఎస్‌ఐఆర్-2026పై అవగాహన కల్పించేందుకు 2కె రన్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి చాహాత్ బాజ్‌పాయి

హనుమకొండ, జూన్ 18 సుదీక్ష న్యూస్ : ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన ఓటరు జాబితాను మరింత సమగ్రమైనదిగా, విశ్వసనీయమైనదిగా తీర్చిదిద్దేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్-2026)లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి శ్రీమతి చాహాత్ బాజ్‌పాయి పిలుపునిచ్చారు.
ఎస్‌ఐఆర్-2026పై ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన 2కె రన్‌ను హనుమకొండ అదాలత్ సర్కిల్‌లోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద డిసిపి ధార కవితలో కలసి కలెక్టర్ ఛాహాత్ బాజ్ పాయి ప్రారంభించారు. అక్కడి నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ ఉత్సాహంగా సాగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడంలో ఖచ్చితమైన ఓటరు జాబితా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పౌరుడు తన పేరు ఓటరు జాబితాలో నమోదైందో లేదో పరిశీలించుకోవడంతో పాటు అవసరమైన సవరణలు, మార్పులు, చేర్పులు చేసుకోవాలని సూచించారు.
ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు), రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏలు) సమక్షంలో ఇంటింటికీ వెళ్లి డిక్లరేషన్ ఫారాలు, ఎన్‌మరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని తెలిపారు. ప్రజలు ఈ ప్రక్రియకు సహకరించి సరైన సమాచారాన్ని అందించాలని కోరారు.సేకరించిన వివరాల ఆధారంగా జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించబడుతుందని, అభ్యంతరాలు, క్లెయిమ్‌ల పరిశీలన అనంతరం అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఎవరైనా తప్పు సమాచారం అందించిన సందర్భాల్లో నేరుగా పేరు తొలగించకుండా, నోటీసు జారీ చేసి విచారణ నిర్వహించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, మరణించిన వ్యక్తులు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన డూప్లికేట్ ఓటర్ల వివరాలను గుర్తించి జాబితాను పరిశుద్ధీకరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఓటరు జాబితాలో పేరు లేని అర్హులైన పౌరులు తప్పనిసరిగా ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.2026 అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే ప్రతి భారతీయ పౌరుడు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హుడని వెల్లడించారు. అర్హత కలిగిన ఏ ఒక్కరి పేరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా ఎన్నికల సంఘం అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు.
ఓటర్లకు అవసరమైన సమాచారం అందించేందుకు జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఈఆర్‌వో కార్యాలయం, సంబంధిత తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లతో పాటు టోల్ ఫ్రీ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 1950 టోల్ ఫ్రీ నంబర్ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు అందుబాటులో ఉంటుందని, నమోదు, సవరణలు, క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు సంబంధించిన వివరాలను ఈ సేవల ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీసీపీ ధార కవిత, అదనపు కలెక్టర్ రవి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇ.వి. శ్రీనివాసరావు, రావు పద్మ, అమరేందర్ రెడ్డి, కుసుమ శ్యాంసుందర్, నాగబెల్లి రజనీకాంత్, ప్రవీణ్ కుమార్, సయ్యద్ ఫైజుల్లా, మున్నా, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కొత్త ప్రశాంత్, టీజీవో రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రావు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్, ఆర్డీఓ వెంకటేష్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.