Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

వాహనాల తనిఖీ సమయంలో దూసుకొచ్చిన లారీ - భూపాలపల్లి డీటీవో మృతి

Author Neti Sudiksha | 22 Jun 2026, 12:55 PM | TELANGANA
వాహనాల తనిఖీ సమయంలో దూసుకొచ్చిన లారీ - భూపాలపల్లి డీటీవో మృతి

వాహనాల తనిఖీ సమయంలో లారీ ఢీకొని డీటీవో మృతి చెందారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులో ఆర్టీవో కార్యాలయం ముందు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఇదే సమయంలో అతివేగంతో అదుపుతప్పిన ఓ బొగ్గు లారీ డీటీవో వెంకన్నపైకి దూసుకొచ్చింది. నడుము పైనుంచి లారీ వెళ్లడంతో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని భూపాలపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది : భూపాలపల్లి రోడ్డు ప్రమాదంలో డీటీవో వెంకన్న మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. వెంకన్న కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ప్రమాదం వెనక దాగిన నిజాన్ని వెలికితీయాలి : భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న ప్రమాదం వెనక దాగిన నిజాన్ని వెలికితీయాలని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా వివరాలను బయటపెట్టాలని సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. డీటీవో వెంకన్న మరణం వెనక ఉన్న వాస్తవాలను ప్రజల ముందుంచాలన్నారు. ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
"భూపాలపల్లి డీటీవో వెంకన్న మృతి వెనక వాస్తవాలను ప్రజల ముందుంచాలి. వెంకన్న మృతి వెనక దాగిన నిజాన్ని వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక, బొగ్గు మాఫియా వివరాలు బయటపెట్టాలి. సమగ్ర విచారణ జరిపి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి" - హరీశ్‌ రావు ట్వీట్​అధికారులకు తగిన భద్రత కల్పించాలి : డీటీవో వెంకన్న మృతిపై నిష్పక్షపాత విచారణ జరపాలని, ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్‌ లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా కట్టడికి చర్యలు చేపట్టాలని, తనిఖీలు నిర్వహించే అధికారులకు తగిన భద్రత కల్పించాలని కోరారు. డీటీవో వెంకన్న కుటుంబానికి తగిన పరిహారం ఇవ్వాలని, వెంకన్న కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఉద్యోగుల జేఏసీ తరఫున వెంకన్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి