Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

'మత్తుబాబులు మాకొద్దు బాబోయ్' అంటున్న ఆడపిల్లల తల్లిదండ్రులు - పెళ్లి విషయంలో ఆచితూచి అడుగులు

Author Neti Sudiksha | 24 Jun 2026, 01:00 PM | TELANGANA
'మత్తుబాబులు మాకొద్దు బాబోయ్' అంటున్న ఆడపిల్లల తల్లిదండ్రులు - పెళ్లి విషయంలో ఆచితూచి అడుగులు

మత్తులోనే హాయి ఉందంటూ కొంత మంది యువత గంజాయి మత్తులో తేలిపోతున్నారు. పలు కారణాలతో డ్రగ్స్​కు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ కారణంగా ఆడపిల్లల తండ్రులు వరుడిని వెతికే సమయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. పొరపాటున డ్రగ్స్​ బాధితుడితో పెళ్లి చేస్తే, తన కుమార్తె జీవితాన్ని చేజేతులా నాశనం చేసినట్టు అవుతుందని భావిస్తున్నారు. ఈ సమస్య ఆడపిల్లల తండ్రులతో పాటు అబ్బాయి తండ్రులకు కూడా ఉంది. కొడుకు మత్తుకు బానిసై బంగారు భవిష్యత్తును బలి చేసుకుంటున్నాడని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉదాహరణలు ఇవే! : హైదరాబాద్​లోని కేబీహెచ్​బీ కాలనీలో ఓ కుటుంబం నివసిస్తోంది. కొద్దిరోజుల క్రితం మంచి ఉద్యోగం చేస్తున్న ఓ కుర్రాడిని తన కుమార్తెకు సంబంధం నిశ్చయించారు. అబ్బాయి వాళ్లది మంచి కుటుంబం అన్న ధీమాతో పెళ్లికి అంగీకరించి, నిశ్చితార్థం కూడా చేశారు. ఆ తర్వాత అమ్మాయి అబ్బాయి పలుమార్లు కాఫీ క్లాబ్​లో కలుసుకొనేవారు. ఓరోజు అతడి వాట్సాప్​ చాట్​లో గంజాయి కావాలంటూ పెట్టిన మెసేజ్​ చూసి అమ్మాయి ఉలిక్కిపడింది. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. అనుమానంతో వారు అబ్బాయిని డ్రగ్స్​ పరీక్ష చేయించుకోవాలని పట్టుబట్టారు. దానికి అతడు అంగీకరించకపోవటంతో పెళ్లి క్యాన్సిల్​ చేశారు.

ఫొటోలు మార్ఫింగ్ చేస్తానని వేధింపులు : అబ్బాయి ఐటీలో ఉద్యోగం చేస్తున్నాడు. దాంతోపాటు బంధుత్వం కూడా ఉంది. ఇక ఆలోచించకుండా అతడితో నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పటి నుంచి అమ్మాయి-అబ్బాయి ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకొనేవారు. అయితే అమ్మాయి ఫోన్​ ఎంగేజ్​ వచ్చినా, వెంటనే రిప్లై ఇవ్వకపోయినా బాగా చిరాకు పడేవాడు. ఒకరోజు ఇంటికి వచ్చి మరీ అమ్మాయితో గొడవపడ్డాడు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు అతని గురించి ఆరా తీశారు. చివరకు అతడికి డ్రగ్స్​ తీసుకొనే అలవాటు ఉందని తెలిసి సంబంధం క్యాన్సిల్​ చేసుకున్నారు. దీంతో అతడు నిశ్చితార్థం ఫొటోలను మార్ఫింగ్‌ చేసి వాళ్లను బెదిరించారు. బాధితులు వెంటనేే షీటీమ్స్‌ను ఆశ్రయించారు.

ఇవి కూడా చదవండి

ఈనెలలో సుమారు 40 మంది యువతీయువకులు : వయోభేదం లేకుండా మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈనెలలోనే సుమారు 40 మంది యువతీ, యువకులను డ్రగ్స్​ కేసులో తెలంగాణ నార్కొటిక్స్‌ బ్యూరో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న వారిలో 15 మంది ఐటీ నిపుణులు, ముగ్గురు వైద్యవిద్యార్థులున్నారు. వీళ్లంతా 20-26 ఏళ్ల మధ్య వయసువారే అని తేలింది. ఈ పరిస్థితులు ఆడపిల్లల తల్లితండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. డ్రగ్స్, వేధింపుల వంటి కేసులున్నాయా! అని అనేక మంది ఆరా తీస్తున్నారని ఓ పోలీసు ఉన్నతాధికారి తన అనుభవాన్ని వెల్లడించారు. కూతురి జీవితం ఏమవుతోందనన్న ఆందోళన తల్లిదండ్రుల్లో ఉందని చెప్పారు.

సర్​ మా పిల్లల్ని మార్చండి! : ఇటీవల ఓ తండ్రి ఈగల్​ పోలీసులకు ఫోన్​ చేసి కొడుకు పరిస్థితి గురించి వివరించాడు. 'మా అబ్బాయి ప్రవర్తనలో తేడా వచ్చింది. ఎప్పుడూ మాతో గొడవ పడుతున్నాడు'. 'ఐటీ కంపెనీలో రూ. 25 లక్షల ప్యాకేజీ వస్తుండేది. కానీ గంజాయికి బానిసై ఉద్యోగం పోగొట్టుకున్నాడు. వాడికి మాములు మనిషిని చేయాలి' ఓ కన్నతల్లి ఆవేదన ఇది. ఇలాంటి కాల్స్​ తెలంగాణలోని ఈగల్‌ విభాగం టోల్‌ఫ్రీ నంబరు 1930కు అధికంగా వస్తున్నాయని అధికారులు తెలిపారు. డ్రగ్స్ బారిన పడినవారిని గుర్తించి, పునరావాస కేంద్రానికి అధికారులు పంపిస్తున్నారు. చికిత్స చేసి సాధారణ స్థితికి తీసుకొస్తున్నారు.