Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

పారదర్శక ఓటర్ల జాబితా రూపకల్పనకు అందరి సహకారం అవసరం: కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి

Author Neti Sudiksha | 24 Jun 2026, 04:28 PM | హన్మకొండ
పారదర్శక ఓటర్ల జాబితా రూపకల్పనకు అందరి సహకారం అవసరం: కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి

హనుమకొండ, జూన్ 24 (సుదీక్ష న్యూస్): ఓటరు జాబితాను మరింత ప్రామాణికంగా, పారదర్శకంగా రూపొందించేందుకు చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్-2026) కార్యక్రమానికి ప్రజలతో పాటు మీడియా ప్రతినిధులు కూడా సహకరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి పిలుపునిచ్చారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన మీడియా అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఐఆర్-2026 అమలు విధానం, ఎన్యుమరేషన్ ప్రక్రియ, ఓటర్ల బాధ్యతలపై అధికారులతో కలిసి వివరాలు వెల్లడించారు. ప్రజలకు సరైన సమాచారం చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని, ఓటర్లలో ఉన్న అపోహలను తొలగించి అవగాహన పెంపొందించేందుకు సహకరించాలని కోరారు.
జూన్ 25 నుంచి జూలై 24 వరకు హౌస్-టు-హౌస్ ఎన్యుమరేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఓటరికి ఎన్యుమరేషన్ ఫారం అందజేసి వివరాలు సేకరిస్తామని, ఇంట్లో లేని వారిని కనీసం మూడు సార్లు సందర్శించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
2002 ఓటరు జాబితాలో ఇప్పటికే ఉన్న అర్హులైన ఓటర్లకు ఈ దశలో అదనపు పత్రాలు అవసరం లేదని, వివరాలు ధృవీకరించి సంతకం తీసుకుంటే సరిపోతుందని స్పష్టం చేశారు. కొత్తగా 18 సంవత్సరాలు నిండిన అర్హులందరికీ ఫారం-6 అందించి ఓటర్లుగా నమోదు చేయనున్నట్లు తెలిపారు.
మరణించిన వ్యక్తులు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు నమోదు చేసుకున్న వారి వివరాలను గుర్తించి నిబంధనల ప్రకారం సవరిస్తామని చెప్పారు. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు నమోదు కావడం చట్టవిరుద్ధమని, ఎన్నికల చట్టంలోని సెక్షన్-31 ప్రకారం అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎస్‌ఐఆర్-2026కు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే 1800 425 1126 టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా ఖచ్చితమైన ఓటరు జాబితా రూపొందించడమే ఎస్‌ఐఆర్-2026 ప్రధాన లక్ష్యమని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి తెలిపారు. ప్రజలు, రాజకీయ పార్టీలు, మీడియా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే కార్యక్రమం విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. రవి, డీఆర్‌ఓ కె. శ్రీనివాస్, డీపీఆర్‌ఓ అయూబ్ అలీ, ఆర్డీవో వెంకటేష్, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, ఇతర అధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.