Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

మత్తు పదార్థాల నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి

Author Neti Sudiksha | 25 Jun 2026, 01:14 PM | TELANGANA
మత్తు పదార్థాల నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీలో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి

హనుమకొండ, సుదీక్ష న్యూస్:
మత్తు పదార్థాల వినియోగం సమాజానికి పెను సవాలుగా మారిందని, వాటి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో హనుమకొండలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

హనుమకొండ ఆదాలత్ సర్కిల్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ర్యాలీలో విద్యార్థులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫ్లాష్‌మాబ్‌లు, అవగాహన నాటికల ద్వారా మత్తు పదార్థాల వల్ల వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు, సమాజంపై పడే ప్రతికూల ప్రభావాలను వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తేనే మత్తు రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రీడలు, విద్య, సృజనాత్మక కార్యక్రమాల వైపు యువతను ప్రోత్సహించాలని సూచించారు.

అనంతరం అధికారులు, విద్యార్థులతో కలిసి “మత్తు పదార్థాలను ఉపయోగించము… ఇతరులను కూడా వాటి నుంచి దూరంగా ఉండేలా చైతన్యం కల్పిస్తాము” అనే ప్రతిజ్ఞ చేయించారు. “డ్రగ్స్‌కు నో చెప్పండి – జీవితానికి యెస్ చెప్పండి”, “మత్తుకు దూరం – ఆరోగ్యానికి చేరువ”, “మాదకద్రవ్యాలకు స్వస్తి పలుకుదాం – ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం” వంటి నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం. విశ్వజ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, హనుమకొండ ఏసీపీ నరసింహరావు, డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్, ఈగల్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ అవంతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, జిల్లా బాలల పరిరక్షణ అధికారులు, చైల్డ్‌లైన్ ప్రతినిధులు, మహిళా శక్తి కేంద్రం, సఖి, హెల్పింగ్ హ్యాండ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, విద్యా, వైద్యారోగ్య, పోలీసు శాఖల అధికారులు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.