Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

పూటకో పార్టీ పేరు మార్చుకునే మీరు మమ్మల్ని విమర్శిస్తారా

Author Neti Sudiksha | 28 Jun 2026, 07:57 PM | నల్గొండ
పూటకో పార్టీ పేరు మార్చుకునే మీరు మమ్మల్ని విమర్శిస్తారా

జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.. బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి, గత పాలనలో జరిగిన అవినీతి, ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై కోమటిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బయటికి వెళ్లిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 13 వేల కోట్ల రూపాయలతో హ్యామ్ రోడ్లను నిర్మిస్తోందని ఆయన తెలిపారు. అభివృద్ధి పనులను ఉద్దేశించి విమర్శలు చేసే వారిపై ఆయన విమర్శలు గుప్పించారు. పచ్చ కామెర్లు ఉన్న వారికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందని వ్యాఖ్యానిస్తూ ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కాళేశ్వరం, ధరణి వంటి పేర్లతో గతంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించిన మంత్రి కోమటిరెడ్డి.. రాష్ట్ర వనరులు దుర్వినియోగం అయ్యాయన్నారు. తరచూ పార్టీలు మారుతూ విమర్శలు చేసే వారికే తాము సమాధానం చెప్పాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రాజెక్టు విషయంలో కూడా ఆయన స్పందించారు. కుర్చీ వేసుకుని సొరంగం పూర్తి చేస్తానని గతంలో చెప్పిన కేసీఆర్ ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. పనుల సమయంలో జరిగిన ప్రమాదాల్లో కార్మికుల మరణాలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుందని, 2028 ఆగస్టు నాటికి ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తి చేసి నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.