Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

కేతన్ హత్య కేసు.. సియా గోయాల్, చేతన్ చౌదరికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

Author Neti Sudiksha | 03 Jul 2026, 10:18 PM | Crime
కేతన్ హత్య కేసు.. సియా గోయాల్, చేతన్ చౌదరికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

మహారాష్ట్రలోని పూనేకు చెందిన వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సియా గోయల్, చేతన్ చౌదరికి పూనే కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. నిందితులు ఇద్దరినీ పోలీసులు శుక్రవారం ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఏఎం విభూతే ముందు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం నిందితులు ఇద్దరూ పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ కస్టడీని మరో మూడు రోజులు పొడిగించాలంటూ పోలీసులు కోర్టును కోరారు. ఇంకా విచారణ జరపాల్సి ఉందని, నిందితులు తమ ఫోన్లలో కోడ్ లాంగ్వేజ్ వాడారని కోర్టుకు చెప్పారు. అందువల్ల తమ కస్టడీకి అప్పగించాలని కోరారు.
కానీ, ఈ వినతిని నిందితుల తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. విచారణ కోసం ఇప్పటికే నిందితుల్ని పోలీసులకు అప్పగించారని, ఈ సమయం సరిపోతుందని వాదించారు. అందువల్ల ఇంకా పోలీస్ కస్టడీ పొడిగించాల్సిన అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. పోలీస్ కస్టడీకి అప్పగించాలన్న వినతిని తిరస్కరించింది. అయితే, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. దీంతో సియా, చేతన్.. ఇద్దరూ జూలై 16 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉంటారు. ఈ కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు.. చేతన్ చౌదరి స్నేహితుడిని కూడా అరెస్టు చేశారు. కేసు విచారణలో సియా పూర్తి వివరాలు వెల్లడించనందున ఆమెకు పాలిగ్రాఫ్‌ లేదా లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు.. వడ్గావ్ మావల్ కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో ముందుగా కోర్టు నిందితులకు నోటీసులు జారీ చేస్తుంది. వారు అంగీకరిస్తే దీనికి లై డిటెక్టర్ టెస్టుకు అనుమతిస్తుంది.