Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న‌ పరశురామ్ ..

Author Neti Sudiksha | 05 Jul 2026, 01:07 PM | Cinema
బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న‌ పరశురామ్ ..

‘గీత గోవిందం’తో టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పరశురామ్ ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. గత కొంతకాలంగా కొత్త ప్రాజెక్ట్ ప్రకటించకుండా కథలపై పనిచేస్తున్న ఆయన, ఈసారి ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కోసం ఓ భారీ పాన్ ఇండియా కథను సిద్ధం చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. 2008లో వచ్చిన ‘యువత’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పరశురామ్, ఆ తర్వాత ‘ఆంజనేయులు’, ‘సోలో’ వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. అయితే ఆయన కెరీర్‌కు అసలైన బ్రేక్ మాత్రం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన గీత గోవిందంతో వచ్చింది.
ఆ సినిమా ఘన విజయం సాధించడంతో పరశురామ్ ఒక్కసారిగా టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ దర్శకుల జాబితాలో చేరిపోయారు. ఆ తర్వాత అగ్రహీరోలతో వరుస సినిమాలు చేస్తారని అంతా భావించినా, పరిస్థితులు అనుకున్నట్లుగా సాగలేదు. తర్వాతి సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ‘గీత గోవిందం’ తర్వాత దాదాపు నాలుగేళ్ల విరామం తీసుకున్న పరశురామ్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా మంచి వసూళ్లు సాధించినప్పటికీ, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంది.
ఆ తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన ‘ది ఫ్యామిలీ స్టార్’ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో పరశురామ్ కొత్త సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తూ గత రెండేళ్లుగా కథల అభివృద్ధిపైనే దృష్టి పెట్టారు. ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, హృతిక్ రోషన్‌కు సరిపోయేలా పరశురామ్ ఒక బలమైన యాక్షన్-ఎమోషనల్ డ్రామా కథను సిద్ధం చేశారట. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే యూనివర్సల్ కాన్సెప్ట్‌తో ఈ కథ రూపొందిందని, ఇప్పటికే హృతిక్‌కు స్టోరీ లైన్ వినిపించగా ఆయన కూడా ఆసక్తి చూపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కథను కేవలం హిందీ ప్రేక్షకుల కోసమే కాకుండా దక్షిణాది మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించే ఆలోచనలో ఉన్నారని సమాచారం.