Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు..

Author Neti Sudiksha | 07 Jul 2026, 12:08 PM | ANDHRA PRADESH
గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు..

విశాఖపట్నం: చేపల రేవు నుంచి వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం భారత తీర రక్షక దళం (కోస్ట్ గార్డ్), భారత నౌకాదళం (నేవీ) సంయుక్తంగా విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు అన్ని వనరులతో రెస్క్యూ ఆపరేషన్‌ను నిరంతరంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

సమాచారం అందిన వెంటనే కోస్ట్ గార్డ్‌కు చెందిన ఐసీజీఎస్ కనక్ లతా బరువా (ICGS Kanak Lata Barua), ఐసీజీఎస్ వీర (ICGS Veera) నౌకలను గాలింపు చర్యలకు పంపినట్లు తెలిపారు. అలాగే కోస్ట్ గార్డ్‌కు చెందిన మూడు హెలికాప్టర్లు సముద్రంలో విస్తృతంగా గాలింపు చేపడుతున్నాయని వెల్లడించారు. ఈ మొత్తం ఆపరేషన్‌ను విశాఖపట్నంలోని రీజినల్ ఆపరేషన్స్ సెంటర్ (ROC) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందన్నారు. భారత నౌకాదళం ఈస్ట్రన్ నేవల్ కమాండ్ (ENC) కూడా సహాయక చర్యల్లో భాగస్వామ్యమైందని తెలిపారు. రెండు యుద్ధ నౌకలు, ఒక సీ కింగ్ హెలికాప్టర్, ఒక అడ్వాన్స్‌డ్‌ లైట్ హెలికాప్టర్ (ALH)ను మోహరించి గాలింపు చర్యలను మరింత వేగవంతం చేసింది.

ఇవి కూడా చదవండి


ఇదిలా ఉండగా.. స్థానిక ఆర్డీవోతో పాటు ఇతర అధికారులతో జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తీర ప్రాంతాల్లో గస్తీని మరింత కట్టుదిట్టం చేసి, మత్స్యకారుల కోసం తనిఖీలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే, ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది సహకారంతో కారి చిన్న అనే మత్స్యకారుడిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. గల్లంతైన మిగిలిన మత్స్యకారుల ఆచూకీ కోసం సహాయక చర్యలు యథావిధిగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.