Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

రైలులో హనీమూన్ సెటప్ వైరల్..

Author Neti Sudiksha | 09 Jul 2026, 11:00 AM | NATIONAL
 రైలులో హనీమూన్ సెటప్ వైరల్..

సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా వైరల్ అవుతున్న ఓ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏసీ రైలు బోగీని హనీమూన్ సూట్‌లా అలంకరించి కొత్త జంటకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దృశ్యాలు నెట్టింట హల్‌చల్ చేశాయి. బెలూన్లు, పూలమాలలు, గులాబీ రేకులు, “ఐ లవ్ యూ” బోర్డులతో అలంకరించిన రైలు క్యాబిన్‌ను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు రైల్వే భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ఘటనపై తాజాగా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 6న బల్లార్షా–ముంబై నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు జల్నా రైల్వే స్టేషన్‌కు చేరుకున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం పెద్ద చర్చకు దారి తీసింది.
వివరాల ప్రకారం, జల్నాకు చెందిన ఓ నూతన వధూవరుల కోసం రైల్లోని ఏసీ కూపేను ముందుగానే బుక్ చేశారు. అదే సమయంలో ‘రహత్ రూమ్ డెకరేషన్’ అనే ఈవెంట్ డెకరేషన్ సంస్థకు చెందిన సిబ్బంది రైలులోకి వెళ్లి క్యాబిన్‌ను ప్రత్యేకంగా అలంకరించారు. కొత్త దంపతులు ఔరంగాబాద్ నుంచి కారులో జల్నా రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి రైలులో ప్రయాణం ప్రారంభించారు.నూతన దంపతుల తొలి రైలు ప్రయాణాన్ని జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మార్చాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఆన్‌లైన్ ద్వారా డెకరేషన్ సేవలను బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. రైలు క్యాబిన్‌ను హనీమూన్ సూట్‌ను తలపించేలా తీర్చిదిద్దడంతో ఆ దృశ్యాలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ఈ వీడియో వైరల్ కావడంతో రైల్వే అధికారులపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అనుమతి లేకుండా బయటి వ్యక్తులు రైలులోకి ఎలా ప్రవేశించారు? భద్రతా నిబంధనలు ఎలా ఉల్లంఘించబడ్డాయి? అనే ప్రశ్నలు తలెత్తాయి. విషయం రైల్వే మంత్రిత్వశాఖ దృష్టికి చేరడంతో అధికారులు వెంటనే విచారణ ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో బయటి వ్యక్తులను అనుమతి లేకుండా రైలులోకి అనుమతించడం, ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌లో భారీగా అలంకరణలు చేయడం రైల్వే నిబంధనలకు విరుద్ధమని అధికారులు గుర్తించారు.