Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

రైలు టికెట్ బుకింగ్ ఇక మ‌రింత సుల‌భం..

Author Neti Sudiksha | 11 Jul 2026, 12:19 PM | NATIONAL
 రైలు టికెట్ బుకింగ్ ఇక మ‌రింత సుల‌భం..

రైలు టికెట్‌ (Rail Ticket) బుక్‌ చేసుకునేప్పుడు అనవసర క్యాప్చాలు (Captchas) చిరాకు క‌లిగిస్తుంటాయి. తరచూ వచ్చే పాప్‌అప్‌లు (Pop ups) పిచ్చిలేపుతాయి. ఏ క్లాస్‌లో సీట్లు ఉన్నాయో తెలుసుకోవడానికి పదేపదే పేజీలు మార్చాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా రైలు ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు త్వరలో తెర పడనుంది. వేగవంతమైన, సులభతరమైన టికెట్‌ బుకింగ్‌ (Ticket Booking) విధానం కోసం వెబ్‌సైట్‌ (Website) ను ఆధునికీకరిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ (IRCTC) తెలిపింది. ఈ మేరకు కొత్త బీటా వెర్షన్‌ (Beta Version) ను తీసుకురానున్న‌ట్లు వెల్ల‌డించింది. మ‌రికొన్ని నెల‌ల్లో పూర్తిస్థాయి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
కొన్ని వారాల క్రితం రాజస్థాన్‌లోని మాలవీయ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (MNIT) విద్యార్థులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఉన్న లోపాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఐఆర్‌సీటీసీ, సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ అధికారులు ఎంఎన్‌ఐటీ విద్యార్థులతో ఢిల్లీలో సమావేశమై బీటా వెర్షన్‌ను ప్రదర్శించారు. కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను భారతీయ రైల్వేలలోని ప్రయాణికుల రిజర్వేషన్‌ ఇంజిన్‌తో అనుసంధానం చేస్తున్నారు. బీటా వెర్షన్‌లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా పలు మార్పులు చేశారు. అనవసర క్యాప్చాలు, పాప్‌అప్‌లు, మెరుస్తూ ఉండే గ్రాఫిక్స్‌ను తొలగించారు.
దాంతో వెబ్‌సైట్‌ వేగంగా పనిచేయడంతోపాటు టికెట్‌ బుకింగ్‌ మరింత సులభమవుతుంది. ఒకే స్క్రీన్‌పై అన్ని క్లాసుల్లో సీట్ల లభ్యత కనిపించేలా రూపొందించడంతో ప్రతి క్లాస్‌ను విడివిడిగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉండదు. టికెట్‌ బుకింగ్‌కు అవసరమైన దశల సంఖ్యను కూడా తగ్గించారు. ప్రయాణికుల వివరాలను సేవ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. తరచూ ప్రయాణించేవారు ప్రతిసారీ అవే వివరాలను నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌తోపాటు వివిధ రైల్వే టికెట్‌ బుకింగ్‌ యాప్‌లకు ఆధారమైన ప్రయాణికుల రిజర్వేషన్‌ ఇంజిన్‌ను కూడా ఆధునికీకరిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.