Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

చ‌క్కెర తిన‌డాన్ని ఆపేస్తే.. క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల‌ను అడ్డుకోవ‌చ్చా..

Author Neti Sudiksha | 14 Jul 2026, 07:59 PM | HEALTH
 చ‌క్కెర తిన‌డాన్ని ఆపేస్తే.. క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల‌ను అడ్డుకోవ‌చ్చా..

చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిందే. అయితే చక్కెర నేరుగా మెదడు క్యాన్సర్‌కు కారణమవుతుందా? క్యాన్సర్ కణాలకు ఆహారం అందకుండా ఉండేందుకు చక్కెరను పూర్తిగా మానేస్తే ట్యూమర్లు తగ్గుతాయా? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. ఈ అంశంపై ఉన్న అపోహలను నిపుణులు నివృత్తి చేస్తున్నారు. చక్కెర నేరుగా మెదడు క్యాన్సర్‌కు కారణం కాదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ట్యూమర్‌ను ఆకలితో చంపాలంటే చక్కెరను పూర్తిగా మానేయాలని సోష‌ల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతున్నారు. ఇలాంటి తీవ్రమైన ఆహార నియమాలు కొన్నిసార్లు ఆరోగ్యానికి మేలు కంటే హాని ఎక్కువ చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ప్ర‌తి క‌ణానికి గ్లూకోజ్ అవ‌స‌రం..
శరీరంలోని ప్రతి కణం, ఆరోగ్యకరమైన కణమైనా, క్యాన్సర్ కణమైనా గ్లూకోజ్‌ను శక్తి కోసం ఉపయోగిస్తుంది. మెదడు ట్యూమర్ కణాలు గ్లూకోజ్‌ను ఎక్కువగా వినియోగించినప్పటికీ, చక్కెరను పూర్తిగా మానేయడం వల్ల ట్యూమర్ మాత్రమే కాదు, శరీరంలోని సాధారణ కణాలు కూడా శక్తి కోల్పోతాయి. అంతేకాకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని శరీరం సహజంగానే నియంత్రించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి చక్కెరను పూర్తిగా మానేస్తే ట్యూమర్ ఆకలితో చనిపోతుందనుకోవడం సరైంది కాదు. అయితే రోజూ అధికంగా చక్కెర ఉన్న ఆహారాలు, శీతల పానీయాలు, శుద్ధి చేసిన కార్బొహైడ్రేట్లు తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు తరచూ పెరుగుతాయి. ఇన్సులిన్‌తో పాటు ఐజీఎఫ్-1 (IGF-1) అనే గ్రోత్ హార్మోన్ కూడా అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ స్థాయిలు ఎక్కువ కాలం పెరిగి ఉండటం వల్ల ఇప్పటికే శరీరంలో ఉన్న ట్యూమర్ కణాలు పెరగడానికి, చికిత్సను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంటే చక్కెర నేరుగా క్యాన్సర్‌కు కారణం కాకపోయినా, అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఏర్పడే హార్మోన్ల మార్పులు ట్యూమర్‌కు అనుకూల పరిస్థితులను సృష్టిస్తాయి.